ఐదేళ్ళ క్రితం తృటిలో తప్పిన అధికారం, తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నాయకులు.. కార్యకర్తలను కాపాడుకోవటం వెరసి తొమ్మిదేళ్ల జగన్ నిరీక్షణకు ప్రజలు ఆయనను ఏనుగు అంబారీ ఎక్కించారు. అది కూడా అలాంటి ఇలాంటి విజయంతో కాదు ప్రత్యర్ధి కోలుకోవటానికే ఎంత సమయం పడుతుందో తెలీనంతగా. ఫలితంగా జగన్ సీఎం కావడం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. శాసనసభ కూడా కొలువుదీరిపోయింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఏర్పాటయిపోయంది.


అయితే ఇక్కడ జగన్ గెలవటానికి కారణం టీడీపీ తప్పిదాలు ఒక కారణం, జగన్కు  ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని ప్రజలు అనుకోవడం కూడా. అయితే అయిదేళ్లుగా వైసీపీ పడిన వేదన, గురైన అవమానం, ఎదుర్కొన్న పరిస్థితులు వారిలో ఒక కసిని, ఆలోచనను బలంగా నాటుకునేలా చేశాయి. గడచిన ఐదేళ్లలో టీడీపీ నాయకులు వైసీపీని ప్రతిపక్షంగా కంటే పగబట్టినట్టుగా వారి వ్యవహారాలు సాగాయి. అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ నుంచి జగన్ పై వ్యాఖ్యలు, ప్రజల్లో వారిని డీగ్రేడ్ చేయడం వంటివి వైసీపీ వర్గాల్లో ఒక ఆలోచన పుట్టించి స్థిరపడిపోయేలా చేశాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి ఆలోచనలకు పదును పెట్టక మానరు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటేంటే అధికారంలోకి వచ్చిన జగన్ ముందు శాఖలపై పట్టు తెచ్చుకోవడం, పాలనా వ్యవహారాలపై దృష్టి సారించడం చేస్తుండడం గర్హించే విషయం. మంత్రి పదవులు పొందిన వారు, ఎమ్మెల్యేలు కూడా తాము ఏమేం చేయాలో అని ఆలోచించే పనిలోనే పడ్డారు.


అయితే కొత్తగా ఎన్నికై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అత్యవసరం. స్పీకర్ ఎన్నిక కూడా అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీపై ప్రజలకు ఓ నమ్మకం ఏర్పడుతున్న సమయంలో దానిపై ప్రజలు చర్చించుకునేలే వైసీపీనే ముందు పావు కదిపిందా అనే అనుమానం రాకమానదు. సభ ప్రారంభమైన రెండో రోజునే, అదీ గవర్నర్ ప్రసంగం కూడా జరుగక ముందే వైసీపీ నాయకులు తాము ఐదేళ్లుగా దాచుకున్న ఆలోచనలన్నింటినీ ఒకేసారి బయటపెట్టినట్టుగా చేశారు. ఒక్కసారిగా టీడీపీ నాయకులపై విరుచుకుపడిపోయారు. ఇదంతా సాధారంగా జరిగేదే అయినా మరీ సభ ప్రారంభమైన రెండో రోజే ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్ వాదోపవాదాలు జరగడం గమనిస్తున్న ప్రజలకు వెగటు పుట్టక మానదు.


జగన్ పాలనపై దృష్టి పెడుతున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం ఆ పార్టీకి ఎంత మంచి చేస్తుందో రెండో రోజే ఇలా వాదోపవాదాలు జరగడం కూడా ఒకరకంగా ప్రజల్లో చెడు చేయదు కానీ కొత్త ఆలోచనలు రేకెత్తించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీలో సాధారణమనే ప్రజలు తీసుకుంటారు కానీ దీనిని టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలను వైసీపీనే కల్పిస్తోంది. తమపై “వైసీపీ పగ తీర్చుకుంటుందని, కోతికి కొబ్బరిచిప్ప దొరికనట్టైంది” అంటూ ఆ పార్టీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి నాయకులు పబ్లిసిటీ చేసుకుంటారు. ఈ సమయంలో ప్రజలకు జగన్ పాలన బాగుందనిపించాలే కానీ కక్ష తీర్చుకుంటున్నారనిపించుకోవడం వైసీపీకి మంచి పరిణామం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: