తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టు రైతు ఇంతకాలం పడిన వెతలకు శుభం కార్డు ప‌డ‌బోతోంది. తలాపున పారుతున్న గోదారమ్మను మన బీళ్లకు తరలించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంచేయాలన్న ఆకాంక్షను..కేవలం రెండున్నరేళ్ల‌లో నిజం కాబోతోంది యావత్‌దేశం అబ్బురపడేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్.. తెలంగాణ జాతికి సమర్పణంచేసే ఘట్టం ఆవిష్కారమవుతున్నది. ఈ నెల 21న ఈ మహత్తర ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడానికి ఎగువనున్న మహారాష్ట్ర, దిగువనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా రావడం దేశ సాగునీటిరంగ చరిత్రలో అపూర్వమైన చారిత్రక సన్నివేశంగా నిలిచిపోనుంది. 


కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో రీడిజైన్‌చేసి, రెండున్నరేళ్ల‌ రికార్డు సమయంలోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేస్తున్న దరిమిలా కార్యక్రమాన్ని పండుగలా జరిపేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ఒకేసారి మోటర్లను నడిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది. గోదావరికి ఇన్‌ఫ్లోలు మొదలైన తర్వాత జూలైలో అన్ని మోటర్లు నడుస్తాయి. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరిలోకి 500 క్యూసెక్కులలోపు మాత్రమే వరద వస్తున్నట్లుగా ఇంజినీర్లు తెలిపారు. ఈ క్రమం లో రోజుకు రెండు మోటర్లను అరగంట చొప్పు న నడిపేందుకు సాంకేతికంగా వీలుపడుతుందని చెప్తున్నారు. ఈ నెల 21న రెండు మోటర్లకు వెట్న్ నిర్వహిస్తారని, ఒక్క మోటర్‌ను అరగంట పరీక్షించే క్రమంలో 0.004 టీఎంసీలు అంటే 10.80 కోట్ల లీటర్ల గోదావరిజలాల్ని ఎత్తిపోయవచ్చని ఇంజినీర్లు తెలిపారు. 


జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానుండటం అద్భుతమైన చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. గోదావరి బేసిన్‌లోని కీలక పొరుగు రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో శుక్ర‌వ‌రాం  ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను స్వయంగా ఆహ్వానించారు. అదేవిధంగా విజయవాడ వెళ్లి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఒక నదీ బేసిన్‌లోని ఎగువ, దిగువ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావడమనేది బహుశా దేశచరిత్రలో ఇదే తొలిసారి అని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. 


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నందిమేడారం పంపుహౌస్‌లో ఇప్పటికే పలు మోటర్ల వెట్న్‌న్రు అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యమున్న మూడు మోటర్ల ద్వారా నీరు విడుదలచేసి పరీక్షించారు. ఇదే క్రమంలో తాజాగా గోదావరితీరాన.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారమైన మేడిగడ్డ బరాజ్ ఫోర్‌షోర్ నుంచి అధికారికంగా నీటివిడుదల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన మేడి గడ్డ బరాజ్ ఫోర్‌షోర్ నుంచి నీటిని ఎత్తి పోసేందుకు కన్నెపల్లి పంపుహౌస్‌ను నిర్మించారు. ఇందులో పదకొండు మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల గోదావరిజలాల్ని ఎత్తిపోయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు తొమ్మిది మోటర్లు సిద్ధమవగా.. మరో రెండింటి పనులు పురోగతిలో ఉన్నాయి. నెలాఖరుకు ఇవికూడా పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరికి ఇంకా ఇన్‌ఫ్లోలు మొదలు కాకపోవడంతో ప్రస్తుతం కన్నెపల్లి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నది. దీంతో 21న జరగనున్న ప్రారంభోత్సవంలో భాగంగా ఆరు మోటర్ల నుంచి నీటిని ఎత్తిపోస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: