మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా తెలుగుదేశంపార్టీ నేతలకు ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులకే జగన్మోహన్ రెడ్డిపై పడి ఒకటే ఏడుస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు జరిగిన అవమానానికి జనాలు భోరుమని ఏడుస్తున్నారట. అలాగని టిడిపి ఎంఎల్సీ బుద్ధా వెంకన్న సెలవిచ్చారు లేండి.

 

చంద్రబాబుకు అవమానం జరిగితే జనాలు ఎందుకు భోరుమని ఏడుస్తున్నారో అర్ధం కావటం లేదు. ఏడిస్తే గీడిస్తే టిడిపి జనాలు ఏడవాలి.  నిజానికి జనాలు కంటితడి పెట్టుకునేంత అవమానం కూడా చంద్రబాబుకు ఏమీ జరగలేదు. చాలా రోటీన్ వ్యవహారాన్ని టిడిపి నేతలు భూతద్దంలో చూపించి జనాల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంతే.

 

విమానాశ్రయంలో మామూలు ప్రయాణీకుల్లాగే సెక్యురిటీ చెక్ జరిగిందట. కాన్వాయ్ ను బయటే ఆపేసి ప్రయాణీకుల వాహనంలోనే చంద్రబాబును కూడా విమానం దాకా తీసుకెళ్ళారట. ఇంకేముంది ? జగన్ పై మాట్లాడటానికి టిడిపి నేతలకు గడచిన 15 రోజులుగా విషయమేమీ దొరకలేదు. ఎప్పుడైతే చంద్రబాబు-సెక్యురిటీ అంశం చోటు చేసుకుందో వెంటనే టిడిపి గొంతులు లేచాయి.

బుద్ధా మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న వైసిపి నేతలు  కేంద్ర ప్రభుత్వంతో చెప్పించి చంద్రబాబును సెక్యురిటీ చెక్ చేయించినట్లు మండిపడుతున్నారు. సిఎంగా ఉన్నపుడు ఉండే కొన్ని సౌకర్యాలు ఓడిపోయిన తర్వాత ఉండవన్న కనీసం ఇంగితాన్ని కూడా టిడిపి నేతలు మరచిపోయినట్లున్నారు.

 

ఇపుడు చంద్రబాబుకు సెక్యురిటీ చెక్ జరిగినట్లే మొన్నటి వరకూ జగన్ కు కూడా జరిగిందని టిడిపి నేతలు మరచిపోయారు. పైగా కేంద్ర పౌర విమానయాన శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం వివిధ హోదాల్లో ఉన్న  33 మందికి మాత్రమే సెక్యురిటీ చెక్ నుండి మినహాయింపు ఉంటుంది. 33 హోదాల్లో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. మరి ఇంతచిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారంటే జనాల సానుభూతి కోసమే అని అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: