వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట కీల‌క‌మైంది. ఇక్క‌డ గతంలో మంత్రిగా ఉన్న ప్ర‌త్తిపాటి పుల్లారావును ఓడించి, ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న ఖాతాలో వేసుకో వాల‌ని భావించిన జ‌గ‌న్ దీనికి అనుగుణంగా చ‌క్రం తిప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌దైన వ్యూహంతో ముందుకు వెళ్లారు. అప్ప‌టి వ‌ర‌కు పార్టీకి అండ‌గా, విప‌క్షంలో ఉన్నా.. తాను గెల‌వ‌క‌పోయినా.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. పార్టీని ముందుకు న‌డిపించారు. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి పునాదుల‌ను బ‌లోపేతం చేశారు. అయితే, ప్ర‌త్తిపాటి, మ‌ర్రి సేమ్ సామాజిక వ‌ర్గాలు కావ‌డంతో ఎక్క‌డైనా దెబ్బ‌కొట్టే అవకాశం ఉంటుంద‌ని భావించిన జ‌గ‌న్‌.. అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. 


బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌, ఆర్థికంగా బ‌లంగా ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీకి ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. ఈ విష‌యంలో మర్రిని కూడా జ‌గ‌న్ ఒప్పించారు. త‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యం మేర‌కు మ‌ర్రి ప‌క్క‌కు త‌ప్పుకొని పార్టీ విజ‌యానికిముఖ్యంగా ర‌జ‌నీ గెలుపు కోసం ఆయ‌న త‌న‌వంతు కృషి చేశారు. ఇక‌, ఆర్థికంగా చాలా బ‌లంగా ఉన్న ర‌జనీ.. ఆది నుంచి తాను చెప్పిన‌ట్టు మంత్రి ప్ర‌త్తిపాటిని ఓడించ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగారు. ఎన్నిక‌ల్లో విజ‌యం కూడా సాధించారు. అయితే, ఇప్పుడు ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. 


ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కిన ర‌జ‌నీ.. నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించాల‌నే విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె కొంద‌రిని ప‌ట్టించుకోవడం మానేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, త‌మ నేత‌ సీటును తీసుకుని, త‌మ‌నే ఆమె ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌ర్రి అనుచ‌రులు సీరియ‌స్‌గా ఉన్నారు. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో తాము పునాది వేస్తే.. త‌మ పునాది మీద గెలిచిన ర‌జ‌నీ ఇప్పుడు ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ముందుకు వెళ్ల‌డం స‌రికాద‌ని వారు అంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం వ‌ర‌కు మ‌ర్రితో క‌లిసి వెళ్లిన ర‌జ‌నీ ఆ త‌ర్వాత మ‌ర్రిని పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు ఆయ‌న్ను క‌ల‌వ‌లేద‌ని కూడా తెలుస్తోంది.


అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా త‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇస్తాన‌ని చెప్పి.. ఇవ్వ‌క‌పోవ‌డంపైనా ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య‌ ఆధిప‌త్య ధోర‌ణి పెరుగుతోంది. నేను ఎమ్మెల్యేని- అనే ఆధిప‌త్య ధోర‌ణిలో ర‌జ‌నీ ఉండ‌గా, మ‌ర్రి సీనియ‌ర్ కావ‌డంతో ఆయ‌న త‌న కేడ‌ర్‌ను కాపాడుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతోన్న ప‌రిస్థితి. ర‌జ‌నీ ఈ గెలుపు త‌న గెలుపే అని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ట‌. ఇక ఆ గెలుపు నేను త్యాగం చేసిన సీటు- అని మ‌ర్రి త‌న అనుచ‌రుల వ‌ద్ద చెబుతున్న‌ట్టు భోగ‌ట్టా. దీంతో చిల‌క‌లూరిపేట వైసీపీలో ఒక విధంగా ఆధిప‌త్య రాజ‌కీయాలు తెర‌మీద‌కి వ‌చ్చాయ‌నే చెప్పాలి. మ‌రి రాబోయే రోజుల్లో ఇవి ఎంత దూరం వ‌ర‌కు వెళ్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: