ఇప్పుడంటే ఎన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.  ఒక్కదానిమీదనే ఆధారపడకుండా వివిధ కోర్సులు చేస్తూ.. ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు.  మెడిసిన్ చేయాలనే పట్టుదల ఉన్నవాళ్లు మెడికల్ పరీక్షలు రాస్తుంటారు.  ఇదిలా ఉంటె, మెడికల్‌, డెంటల్‌ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ 2019  ప్రవేశ పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుండి హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ప్రకటించింది. 

అభ్యర్థుల మార్కులను క్రమసంఖ్యలో ఇచ్చిన జాబితాను  యూనివర్సిటీ  తన వెబ్‌సైట్‌లో పెట్టింది.  తెలంగాణలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే యూనివర్సిటీ  విడుదల చేయనుంది. జాతీయ స్థాయి కోటాలో తెలంగాణ రాష్ట్రం చేరినందున  ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన  అర్హులైన అభ్యర్థులు ఈ జాబితాలో చేరుతారు. 

అలాగే నిర్ణీత కోటాకు లోబడి తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో ప్రవేశానికి అర్హులౌతారు. జాతీయ కోటాలో చేరిన ప్రతి రాష్ట్రం తమ రాష్ట్రలోని 15 శాతం సీట్లను జాతీయ కోటాకు బదిలీ చేస్తోంది. కాబట్టి తుది ర్యాంకులలో మార్పు ఉంటుంది.  ఒరిజినల్ సర్టిఫికెట్ల  వెరిఫికేషన్ తరవాత పూర్తి స్థాయి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. జాతీయస్థాయిలో జరిగిన నీట్‌ పరీక్షల్లో  మొదటి 1,000  ర్యాంకుల లోపు 43 మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు.

2,000 ర్యాంకులోపు 69  మంది ఉండగా, 5,000లోపు 149 మంది, 10,000లోపు 289  మంది, 20,000లోపు 600  మంది ఉన్నట్లు యూనివర్సిటీ తెలిపింది. 25,000 ర్యాంకులలోపు 793  మంది, 30,000 లోపు 967 మంది, 40000లోపు 1,331  మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.  ప్రతిసంవత్సరం ప్రభుత్వ, ప్రవేట్ కాలేజీల నుంచి లక్షలాది మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు.  ఇలా డాక్టర్లుగా పట్టా పుచ్చుకొని బయటకు వచ్చిన వాళ్లకు ఉపాధి దొరుకుందా అంటే.. ఏమో చెప్పలేం. డాక్టర్ చదువుకు ఉన్న గిరాకీ.. డాక్టర్ వృత్తికి లేకపోవడం శోచనీయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: