ఏపీలో విపక్ష టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంటి మీద కునుకు పట్టడం లేదు అన్న వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తుందట. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతూ తాను కానీ సైగ చేస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా మిగలదు అని సవాల్ చేశారు. 


అయితే చంద్రబాబు తాను ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోన‌ని... అలా చేయాల్సి వస్తే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకుంటామని కూడా ప్రకటించినట్టు తెలిసింది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తామ పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొన్నార‌ని.. ఇప్పుడు తాము ఆ ప‌ని చేయ‌మ‌ని జ‌గ‌న్ చెప్పారు.


ఇక ఐదేళ్ల పాటు టీడీపీలో ఉంటే రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. త‌మ ప‌నులు కావని డిసైడ్ అయిన  కొందరు టిడిపి ఎమ్మెల్యేలు అప్పుడే వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్ళిపోయారు. పార్టీ పిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచేందుకు ఎంతమాత్రం ఇష్టం లేని జగన్ టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలను తమ పదవులకు రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టినట్లు కూడా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 


ఇదిలా ఉంటే టీడీపీ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మాట్లాడుతూ తనతో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని...  జగన్ ఓకే చెపితే వీరు పార్టీ మారేందుకు సిద్ధమని కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి.


ఇక కోటంరెడ్డి త‌న‌తో ట‌చ్‌లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్ప‌క‌పోయినా ఒక‌రు మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ సొంత బ‌లం ఉన్న ఎమ్మెల్యే అని.. ఆయ‌న‌కు అక్క‌డ పార్టీ ఇమేజ్ క‌న్నా వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉంద‌ని చెప్పారు. ఏపీ హెరాల్డ్‌కు అందిన అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వైసీపీలోకి వెళ‌తార‌న్న ఎమ్మెల్యేల్లో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమారే అని తెలుస్తోంది. 


వీరిలో వంశీ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు... ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా జ‌గ‌న్ ఫ్యామిలీతో ట‌చ్‌లో ఉంటున్నారు. మంత్రి కొడాలి నానికి వంశీ బాగా కావాల్సిన వ్య‌క్తి. వీరే వేర్వేరు పార్టీల్లో ఉన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌. ఇటు నానితో ట‌చ్‌లో ఉండ‌డంతో పాటు అటు జ‌గ‌న్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో వంశీ పార్టీ మార‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేద‌న్న టాక్ వ‌చ్చేసింది. టీడీపీ వ్య‌తిరేక వేవ్‌లో కూడా వంశీ గెల‌వ‌డం ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ కూడా ఓ కార‌ణం.


ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. విచిత్రం ఏంటంటే ర‌వికి వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉంది. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న గెలుస్తున్నారు. కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ ఇలా పార్టీ ఏదైనా గెలుపు మాత్రం ర‌విదే. ఇక 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన ర‌వికి జ‌గ‌న్ మంచి ప్ర‌యార్టీనే ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌నపై తీవ్ర‌మైన ఒత్తిళ్లు రావ‌డంతో టీడీపీలోకి వెళ్లిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న టీడీపీ నుంచి గెలిచారు. ర‌వికి, జ‌గ‌న్‌కు కూడా మంచి అనుబంధ‌మే ఉంది. మొత్తానికి పార్టీ మారే లిస్టులో ఈ ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై వీరు ఎలా స్పందిస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: