జూన్ నెల వచ్చిన ఇంకా భానుడి ప్రాతాపాన్ని తగ్గలేదు. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు రావల్సి ఉండగా అవి ఆలస్యంగా వస్తాయని వాతావరణ కేంద్ర నిపుణులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్రాలో ఎండలు మాత్రం తగ్గు ముఖం పట్టకపోవడంతో వేడి, ఉక్కపోతలతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురవాల్సిన ఈ సమయంలో కూడా ఎండలు ఠారెత్తిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

ఈనెల 18వ తేదీ వరకూ ఎండల తీవ్రత ఇలానే కొనసా గుతుందని ఆర్టీజీఎస్‌లోని ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌ ఫోర్‌ క్యాస్టింగ్‌ అండ్‌ ఎర్లీ వార్నింగ్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (అవేర్‌) నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా పడిపోతున్నందున ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయని, వడగాడ్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల్లో తిరగకుండా నీడపట్టున ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆర్టీజీఎస్‌ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా బొండాపల్లె మండలం కనిమెరకలో అత్యధింకగా 46.20 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. విశాఖ జిల్లా దేవరాపల్లె మం డలం వేచలంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు జిల్లా లోనూ 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈనెల 19న రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకుతాయని భావిస్తున్నారు. వీటి ప్రభావం కారణంగా ఈనెల 19 నుండి 24వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: