ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని బీజేపీ రథ‌సార‌థి న‌రేంద్ర‌మోదీ రెండో ద‌ఫా చేప‌ట్టిన అనంత‌రం శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్ ఐదో పాలకమండలి సమావేశం జ‌రిగింది. ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు విచ్చేశారు. అయితే, ఈ స‌మావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజ‌ర‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రెండో ద‌ఫా సీఎం ప‌గ్గాలు చేప‌ట్టిన కేసీఆర్‌...జ‌ల వ‌నరుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ హాజరుకాలేదు. అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేకపోయిన అమరీందర్ సింగ్.. తనకు బదులుగా రాష్ట్ర ఆర్థిక మంత్రిని పంపారు. ఈ సమావేశానికి హాజరుకాబోనని బెంగాల్ సీఎం మమత ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్‌తో రాష్ర్టాలకు ఎలాంటి ఉపయోగం లేదని, ఈ భేటీకి హాజరుకావడం వృథా అని ఆమె ఇంతకుముందు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ ఈ భేటీకి అకార‌ణంగా గైర్హాజ‌రు అయ్యారు.


ఇదిలాఉండ‌గా, ఈ సంద‌ర్భంగా  ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ,ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసిందని, ఇక అందరం దేశాభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాటం సాగించాలన్నారు. 2022 నాటికి నవభారతాన్ని నిర్మించడం ఉమ్మడి లక్ష్యమని చెప్పారు. స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన పథకాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాధించిన విజయాలకు తార్కాణాలని పేర్కొన్నారు. సాధికారత, జీవన సౌలభ్యం ప్రతి భారతీయుడికీ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్దేశించుకున్న లక్ష్యాలను అక్టోబర్ 2నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ చేరుకోవాలని, అలాగే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తికానున్న 2022 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను చేరుకునేందుకు కార్యాచరణ త్వరగా ప్రారంభించాలని సూచించారు. దేశ ఎగుమతులు పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరువును కట్టడి చేసేందుకు సమర్థ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్ డ్రాప్, మోర్ క్రాప్ వ్యూహాన్ని అమలుచేయాలని సూచించారు.


వచ్చే ఐదేళ్ల‌లో దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఇది సవాలుతో కూడుకున్నదైనప్పటికీ కచ్చితంగా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ర్టాలు కీలక వనరులపై దృష్టిపెట్టాలని, జిల్లాస్థాయి నుంచి స్థూల దేశీయోత్పత్తిని (జీడీపీని) పెంచే దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దీన్ని సాధించేందుకు మత్స్యశాఖ, పశు సంవర్ధక, ఉద్యానవనాలు, పండ్లు, కూరగాయలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం కిసాన్ పథకంతోపాటు రైతుల కోసం చేపట్టిన ఇతర పథకాలు సకాలంలో లబ్ధిదారులకు చేరాలని స్పష్టం చేశారు. వ్యవసాయంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ పెట్టుబడులు పెంచాలని, లాజిస్టిక్స్‌ని బలోపేతం చేయాలని, సరైన మార్కెట్‌ను కల్పించాల్సి ఉన్నదని చెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని ప్రస్తావిస్తూ.. నక్సల్ హింసకు వ్యతిరేకంగా పోరు ప్రస్తుతం నిర్ణయాత్మక దశలో ఉందని తెలిపారు. హింసను దీటుగా ఎదుర్కొంటూనే, అభివృద్ధిని కూడా వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: