ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అతి సామాన్య వ్యక్తుల ధాటికి టీడీపీలో తల పండిపోయిన సీనియర్లు తునాతునకలు అయిపోయారు. రెండు.. మూడు దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్న వారు కూడా ఎలాంటి రాజకీయ అనుభవం లేని వైసిపి అభ్యర్థుల చేతుల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఇంకా చెప్పాలంటే 1994 లో ఎన్టీఆర్ ప్రభంజ‌నంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులు ఎలా ? మట్టికరిచారో ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభంజ‌నంలో  టిడిపి నేతలు కూడా అదే పంథాలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఈ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన కొద్ది మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఒకరు. పెద్దాపురం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసిన చినరాజప్ప వైసీపీ అభ్యర్థి తోట వాణి పై విజయం సాధించారు.


ఈ క్ర‌మంలోనే పెద్దాపుంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చిన‌రాజ‌ప్ప‌కు తోట వాణి చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌. పేరుకే రాజ‌ప్ప ప‌ద‌విలో ఉన్నా పెత్త‌నం మొత్తం వాణిదే న‌డుస్తోంద‌ట‌. రాజ‌కీయంగా అధికారంలో ఒక పార్టీ ఉంటే ... ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి మాట‌కు ఎలాంటి విలువ ఉంటుందో ?  తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో రాజ‌ప్ప‌ను ఓడించాల‌న్న క‌సితో తోట వాణి పెద్దాపురం నుంచి పోటీ చేశారు. 


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో హోం మంత్రిగా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన చినరాజప్ప ఇప్పుడు కనీసం పెద్దాపురంలో కూడా చక్రం చెప్పలేని పరిస్థితి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో చినరాజప్ప హోంమంత్రిగా ఉంటే... తోట వాణి భర్త తోట నరసింహం కాకినాడ ఎంపీగా ఉన్నారు. చినరాజప్ప ఓ ఇంటర్వ్యూలో తోట వాణికి తండ్రి అయిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను తీవ్రంగా అవమానించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు వైసిపిలోకి జంప్ చేసిన తోట వాణి చినరాజప్ప ను టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించిన చినరాజప్పను ఓడించి తాను పగ నెరవేర్చుకుంటాను కూడా శ‌ప‌థం చేశారు.


అయితే ఎన్నికల్లో రాజప్పకు గ‌ట్టి పోటీ ఇచ్చిన ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు వైసిపి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడంతో పెద్దాపురం నియోజక వర్గంలో వాణి తన ఆధిపత్యం చెలాయిస్తున్నారు. చిన్న విషయంలో కూడా చినరాజప్ప మాట నెగ్గ‌డం లేదట. దీంతో రాజప్పకు తోటపని దూకుడు ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన తోట వాణి పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ‌ప్ప మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన వ్యక్తులు ఇక్కడకు వచ్చి పెత్తనం చేస్తే సహించేది లేదని విసుర్లు విసురుతున్నారు.


టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు స‌హించ‌న‌ని.. టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉందని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. విచిత్రం ఏంటంటే తోట వాణి పెద్దాపురానికి నాన్ లోక‌ల్ అని చెపుతోన్న చిన‌రాజ‌ప్ప మ‌రి తాను కూడా నాన్ లోక‌ల్ అన్న విష‌యాన్ని తెలుసుకోక‌పోతే ఎలా ? అన్న సెటైర్లు కూడా ఆయ‌న‌పై ప‌డుతున్నాయి. ఏదేమైనా ఐదేళ్ల పాటు పెద్దాపురంలో రాజ‌ప్ప పేరుకే ప‌ద‌విలో ఉన్నా పెత్త‌నం అంతా తోట ఫ్యామిలీదే.



మరింత సమాచారం తెలుసుకోండి: