టీడీపీకి కంచుకోట‌గా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాను పూర్తిగా త‌న‌వైపు తిప్పుకొనేందుకు వైసీపీ అదినేత జ‌గ‌న్ చేసిన వ్యూ హం ఫ‌లిస్తుందా?  ఈ జిల్లాలో కీల‌క‌మైన ఎస్సీ, కాపు, బీసీ వ‌ర్గాలు ఇక వైసీపీ వైపు న‌డుస్తాయా? వ‌చ్చే 2024 నాటికి జిల్లాలో వైసీపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు రాజ‌కీయ మేధావుల‌ను తొలిచేస్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రిలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో వైసీపీ కేవ‌లం 5 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. మొత్తంగా టీడీపీ త‌న ఖాతాలో వేసుకుంది. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో ఉన్న మూడు ఎంపీ సీట్ల‌లోనూ టీడీపీయే గెలిచింది. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ 14 చోట్ల విజ‌యం సాధించింది. టీడీపీ కేవ‌లం 4 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఇక‌, జ‌న‌సేన ఒక్క రాజోలులో మాత్ర‌మే విజ‌యం సాధించింది. అమ‌లాపురం, కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మూడు ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులు ఘ‌న‌విజ‌యం సాధించారు.


ఆది నుంచి కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ జిల్లా తాజాగా రాష్ట్రంలో ఏర్ప‌డిన జ‌గ‌న్ సునామీతో యూట‌ర్న్ తీసుకుని వైసీపీకి అండ‌గా నిలిచింది. జిల్లాలో ఎస్సీ, బీసీ, కాపు వ‌ర్గాలు ఆధిపత్యం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టి లో ఉంచుకుని, ఈ జిల్లాను వైసీపీకి కంచుకోట‌గా మార్చే క్ర‌మంలో ఆయ‌న త‌న‌దైన వ్యూహం ప్ర‌ద‌ర్శించారు. జిల్లా పెద్ద‌ది కావ‌డం, అనేక సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉండ‌డంతో ఆయా సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం పెంచారు. త‌న మంత్రి వ‌ర్గంలో ముగ్గురికి అవ‌కాశం ఇచ్చారు. వీరిలో బీసీ వ‌ర్గం నుంచి శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, కుర‌సాల క‌న్న‌బాబు(కాపు), అమ‌లాపురం నుంచి గెలిచిన పినిపె విశ్వ‌రూప్(ఎస్సీ)ల‌కు త‌న మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం ఇచ్చారు. 


తూర్పులో ఈ మూడు సామాజిక‌వ‌ర్గాలు బ‌లంగానే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఈ మూడు వ‌ర్గాల‌కు న్యాయం చేసేలా మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక‌, వీరిలోనూ పిల్లికి డిప్యూటీ సీఎం హోదాతోపాటు అత్యంత కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌ను అప్ప‌గించారు. మాజీ జ‌ర్న‌లిస్ట్ అయిన క‌న్న‌బాబుకు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. ఇక గ‌తంలో మంత్రిగా ఉన్న విశ్వ‌రూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. దీంతో తూర్పు పై జ‌గ‌న్ ఏ రేంజ్‌లో ఆశ‌లు పెట్టుకున్నారో తెలుస్తోంది. జిల్లా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతోపాటు.. అదే స‌మ‌యంలో జిల్లాలో వైసీపీని మ‌రింత‌గా బ‌లోపేతం చేసేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లారు. 


అదే స‌మ‌యంలో ఈ జిల్లాలో టీడీపీకి అండ‌గా ఉన్న బీసీ క‌మ్యూనిటీని త‌న‌వైపు తిప్పుకొనేందుకు కూడా జ‌గ‌న్ దూర దృష్టితో వ్య‌వ‌హ‌రించారు. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన కేబినెట్ కూర్పు ప్ర‌కారం చూస్తే.. ఇక్క‌డ నుంచి మంత్రులుగా ఉన్న నాయ‌కుల‌కు చాలానే బాధ్య‌త అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. జిల్లాలో త్వ‌ర‌లోనే జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌ర‌వేయాల‌న్న‌దే జ‌గ‌న్ వీరికి అప్ప‌గించిన ప్ర‌ధాన మిష‌న్‌. ఈ క్ర‌మంలోనే టార్గెట్ 2024 అనే నినాదాన్ని అప్పుడే భుజానికి ఎత్తుకున్నజ‌గ‌న్ ఆశ‌యాల‌కు అనుగుణంగా వీరంతా క‌లిసి ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: