అమిత్‌షా ఏంటి..ప్ర‌పంచ రికార్డు సాధించ‌డం ఏంటి....అలాంటి వ్య‌క్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌పై ఫోకస్ పెట్ట‌డం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?  ప్ర‌పంచ‌రికార్డు సాధించింది అమిత్ షా స్వ‌యంగా కాదు...ఆయ‌న సార‌థ్యంలోని క‌మ‌ల‌ద‌ళం. ఇప్పుడు మ‌న రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టేది కూడా అదే క‌మ‌ల‌ద‌ళం. ఇదంతా బీజేపీ స‌భ్య‌త్వం గురించి. 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిన బీజేపీ జులై 6 నుంచి ఆగస్ట్ 10 వరకు నమోదు కార్యక్రమం మొద‌లుపెడుతోంది. ఇందులో ఏపీ, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.


బీజేపీ స‌భ్య‌త్వం గురించి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ చౌహాన్ తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించారు.2.20 కోట్ల మంది కొత్త సభ్యులు లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగనుంద‌ని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి రోజైన జులై 6 నుంచి ఆగస్ట్ 10 వరకు దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు వివ‌రించారు. ఇప్ప‌టికే త‌మ‌కు ప్ర‌పంచంలోని అతి ఎక్కువ స‌భ్యులున్న పార్టీగా గుర్తింపు ఉంద‌ని...ఇదే స‌మ‌యంలో పార్టీ సభ్యత్వాన్ని 20 శాతం మేర పెంచాలని పార్టీ నిర్ణయించిందన్నారు.  బీజేపీ ఉనికి అంతగా లేని, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్, కశ్మీర్, సిక్కిం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.


కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు ఎటుచూసినా కాషాయమే కనిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. ఈశాన్యంలో ముందుగా బీజేపీ జెండా ఎగరేశాక, ఇప్పుడు సౌత్‌‌‌‌పై దృష్టి మళ్లించారు. బీజేపీ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ పూర్తిగా పొలిటికల్‌‌‌‌ ఈక్వేషన్లను మార్చే విధంగా జరగబోతోందని అంటున్నారు. పార్టీలోకి కొత్త నీరును ఆహ్వానిస్తున్నారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌‌‌‌, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌‌‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. కర్ణాటక, మధ్యప్రదేశ్‌‌‌‌ రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. దీంతో స‌భ్య‌త్వంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది 


మరింత సమాచారం తెలుసుకోండి: