కశ్మీర్‌లో పుల్వామా తరహా మరో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భారత్‌ నిఘా వర్గాలకు పాక్ నుంచి సమాచారం అందినట్టు భోగట్టా. పుల్వామా, అవంతిపొర జిల్లాల్లో ముష్కరులు దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. వాహనానికి ఐఈడీ అమర్చి పుల్వామా తరహాలోనే రహదారిపై దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గత నెలలో ఉగ్రవాది జాకీర్‌ మూసాను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

 

ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. అదనపు బలగాలను మొహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతను మరింత పెంచారు. పాక్ అందజేసిన సమాచారంలో పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు వ్యూహరచన చేసిన ఉంది కానీ, స్పష్టంగా ఎక్కడనేది తెలియరాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేవలం ఉగ్రదాడి గురించే సమాచారం అందజేసిందని వ్యాఖ్యానించాయి.

 

అల్‌ఖైదా ఉగ్రసంస్థకు అనుబంధంగా జాకీర్‌ మూసా ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ అనే ఉగ్రసంస్థను 2017 మేలో స్థాపించాడు. అయితే ఈ ఏడాది మే 24న పుల్వామా జిల్లా త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మూసాను భద్రతా బలగాలు హతమార్చాయి. 2016 జులైలో హతమైన హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ బృందంలో మూసాయే చివరివాడని పోలీసులు వెల్లడించారు. వనీ అనుచరులు మొత్తం 10 మందిని సైన్యం మట్టుబెట్టింది. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో 45 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

 

రెండు రోజుల కిందట ముగిసిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమ్మిట్‌కు ముందే ఉగ్రదాడుల గురించి పాక్ హెచ్చరించినట్టు, ఈ సమాచారం అమెరికాకు కూడా అందజేసినట్టు ఓ అధికారి వెల్లడించారు.  అంతేకాదు, ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలపై భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి ఎదరువుతోన్న ఒత్తిడి తప్పించుకోడానికే పాక్ ఇలా చేసి ఉంటుందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో భారత రాయబార కార్యాలయానికి పాక్ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: