విజయనగరం/భోగాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా శనివారం జిల్లాకు చేరుకున్న పాముల పుష్పశ్రీవాణికి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే ఆమెకు పెద్దముప్పు తప్పింది. జిల్లా సరిహద్దు ప్రాంతం భోగాపురం మండలం రాజాపులోవ వద్దకు ఉదయం 10 గంటలకు ఆమె చేరుకోగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు.

 

అందరూ శుభాకాంక్షలు చెప్పాక, ఆమె ప్రసంగించేందుకు వేదికపైకి ఎక్కారు. కొద్ది క్షణాలు మాట్లాడాక వేదిక కదిలింది. అంతలోనే వున్న పళంగా స్టేజి కుప్పకూలిపోయింది.  వెంటనే పోలీసులు, నాయకులు పరుగున చేరుకుని ఆమెను కారు వద్దకు తీసుకెళ్లారు. మంత్రికి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. స్టేజ్‌పై ఉన్న వైసీపీ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్‌ పీవీవీ సూర్యనారాయణరాజు(సురేష్‌ బాబు) కుడి కాలికి చిన్న గాయం అయింది.

 

భోగాపురం మండలం రాజాపులోవ నుంచి జిల్లా కేంద్రంలోని జడ్పీ అతిథి గృహానికి మంత్రి చేరుకున్నారు. విజయగనరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితర నాయకులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

భారీగా వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం కిటకిట లాడింది. జిల్లా పరిషత్‌ అతిథి గృహానికి చేరు కున్న మంత్రి పుష్పశ్రీవాణికి కలెక్టర్‌ ఎమ్‌. హరిజవహ ర్‌లాల్‌, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మొత్తానికి పుష్ప వాణిగారికి పెద్ద ముప్పు తొలగిందనే చెప్పాలి. ఇక దానితో అందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: