గత ఏడు ఎనిమిది నెలలుగా తెలుగు రాజకీయాల్లో వరుస పెట్టి ఎన్నికలు హీటెక్కిచేస్తున్నాయి. ముందుగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ప్రారంభమైన ఎలక్షన్ హీట్ ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు హాట్ హాట్‌గా కంటిన్యూ అయింది. తెలంగాణలో వరుసపెట్టి పంచాయతీ ఎన్నికలు, లోక్‌భ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జరిగాయి. ఈ పరంపరలోనే ఇప్పుడు తెలంగాణలో మరో ఆసక్తికర ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రెండు సంవత్సరాల క్రితం ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక తెలుగు రాజకీయాల్లో ఎంత హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిందో ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక దాదాపు అదే స్థాయిలో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయబోతోంది. 


తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అనుకున్న టైమ్‌లో తాజాగా జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు గెలుచుకుని కొత్త ఆశలు రేకెత్తించింది. ఆ పార్టీకి చెందిన యోధోను యోధులు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా విజయం సాధించారు. ఇక టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా విజయం సాధించడంతో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్‌న‌గర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మూడు నెలల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. సాక్షాత్తు టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన  సీటు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ నాయకత్వం సైదిరెడ్డినే ఇక్కడ నుంచి రంగంలోకి దింపనుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని రంగంలోకి దించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు ఓటమి లేకుండా వరుసగా మూడు సార్లు గెలిచిన నియోజకవర్గం కావడంతో ఆయనకు ఇక్కడ గట్టి ప‌ట్టుంది. ఈ క్రమంలోనే తన భార్యను ఇక్కడ పోటీ చేయిస్తే... ఇక్కడ పార్టీ గెలుపును స్వయంగా ఆయన తీసుకుంటారు అనడంలో సందేహం లేదు. 


హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పుడే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. హుజూర్‌న‌గర్‌లో టిఆర్ఎస్‌కు బలం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులతో బేరసారాలకు దిగటం దారుణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పిసిసి అధ్యక్షుడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయాల‌ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏపీలో నంద్యాల ఎన్నికల తరహాలోనే తెలంగాణలో హుజూర్‌న‌గర్ కూడా మంచి రసవత్తరంగా జ‌ర‌గ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: