ఇటీవల డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ముఖ్యంగా కొలకత్తాలో వైద్యులపై జరిగిన అమానుషమైన సంఘటనల నేపధ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) న్యూఢిల్లీ జాతీయ స్థాయి ప్రధాన కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నుంచి 24 గంటల పాటు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, క్లీనిక్, ల్యాబోరటరీలు మూసివేయనున్నారు. 


కాకినాడ IMA ప్రెసిడెంట్, సెక్రెటరీలు డా. వాడ్రేవు రవి, డా.మోర్తా వివేక్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం... అన్ని రంగాలతో పోల్చితే వైద్య రంగం చాలా తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్నదని, అనుక్షణం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా ఆలోచిస్తూ ప్రతీ వైద్యుడు తన సొంత స్వేచ్ఛను సైతం పక్కన పెట్టి అహర్నిషలు కృషి చేస్తారన్నారు. 


అటువంటి తరుణంలో వైద్యులపై అమానుషంగా ప్రవర్తించడం, దాడులకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. సమాజంలో వైద్యుల పడుతున్న రక్షణ లేని , భద్రత లేని పరిస్థితిని వివరించేందుకు గాను సోమవారం ఉదయం నుండి 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. 


ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చట్టాలను అమలులోకి తీసుకురావడంతో పాటు , రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రి వైద్యులు ,క్లినిక్ లు, ల్యాబొరేటరీ సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు. యధావిధిగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి అన్ని వైద్య సేవలు కొనసాగుతాయని డా.ఆనంద్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: