ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో...కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌న వైఖ‌రిని కొన‌సాగిస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆంధ్రులు గంపెడాశ‌తో ఎదురుచూస్తున్న‌ప్ప‌టికీ...బీజేపీ మాత్రం స‌సేమిరా అంటోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు ప్ర‌త్యేక హోదా ఇచ్చే చాన్సేలేద‌ని కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు.

 

కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో మీడియాతో మాట్లాడుతూ,  ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌ విభజన హామీల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్, జగన్..విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చర్చ‌నీయాంశంగా మారాయి.

 

బీజేపీ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సైతం ఇదే కామెంట్లు చేశారు. ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమే అని ఆయ‌న అన్నారు. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. వారికేం ఇవ్వాలో మాకు తెలుసని అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీధ‌ర్ రావు ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి 250 సీట్ల కంటే ఎక్కువ రాకూడదని కోరుకున్న జగన్ మాకు మిత్రుడెలా అవుతారు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. 

 

ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నికల్లో టీడీపీది సహజ ఓటమి కాదని అభివర్ణించారు. గెలుపొటముల లెక్కలో ఈ ఓటమిని చూడకూడదని తెలిపారు. భనిష్యత్తులో కొత్త రాజకీయాలకు తెర లేచేందుకు టీడీపీ ఓటమి ఆస్కారమిచ్చిందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తేనే.. ఇతరులు మా వద్దకు వస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ బలమైన శక్తిగా అవతరించబోతోంది. ఏపీలోనూ టీడీపీకి చెందిన వివిధ స్థాయి నేతలు మా పార్టీతో టచ్ లో ఉన్నారని ముర‌ళీద‌ర్ రావు తెలిపారు. కాగా, ప్ర‌త్యేక హోదాపై ఒకేరోజు ఇద్ద‌రు నేత వ్యాఖ్య‌లు చర్చ‌నీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: