ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తన కేబినెట్‌లో ఎవరు ఊహించని విధంగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు కీలకమైన హోం మంత్రి పదవిని కట్టబెట్టారు. రాజశేఖర్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డికి హోం మంత్రి పదవి ఇవ్వటం అప్పట్లో ఒక సంచలనం అయితే ఇప్పుడు జగన్ వర్గానికి చెందిన సుచ‌రిత‌కు హోంమంత్రి ఇవ్వటం సంచలనాలకే సంచలనంగా మారింది. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుచ‌రిత ఆదివారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆమె తన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 


రాష్ట్రంలో ఎవరైనా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని... ఈ విషయంలో ఎలాంటి వారు ఉన్న తాను ఉపేక్షించన‌ని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో  ఓ మహిళా హోంమంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె చెప్పారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్న సుచరిత ఎవరైనా నేరం చేయాలంటే భయపడేలా కఠిన చట్టాలను తీసుకు వస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తాను పూర్తి భరోసాతో ఉంటాను అని కూడా అన్నారు. ఇక కళాశాలలో ర్యాగింగ్, వేధింపులను పూర్తిగా నిర్మూలిస్తామని... మహిళల‌ను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 


ఇక మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన... ఆమె పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇక ఏపీ పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకు వస్తున్నాం అన్న సుచరిత మహిళా బెటాలియన్.... గిరిజన బెటాలియన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోని చాలా పోలీస్టేష‌న్ల‌లో మహిళా కానిస్టేబుల్‌కు సరైన సౌకర్యాలు ఉండటం లేదని... వీళ్ళ ఇబ్బందులు తీర్చడంతోపాటు వీళ్ల‌ సంక్షేమానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: