ఏపీకి ప్రత్యేక హోదా కోసం త‌మ పోరాటం, ప్ర‌య‌త్నం కొనసాగుతుంద‌ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ఈ విష‌య‌మై నిన‌దించామ‌ని తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. అఖిల‌ప‌క్ష సమావేశానికి హజరైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి ఈ భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ మేర‌కు వెల్ల‌డించారు. 

 

ప్ర‌త్యేక హోదానే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని, అది వచ్చిన తర్వాతే మిగిలిన అంశాల గురించి పరిశీలిస్తామని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. గతంలోనే  చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టామని, అవసరమైతే రాజ్యాంగం లోని 9 షెడ్యూల్ సవరించాలని కోరామన్నారు. అవసరాన్ని బట్టి దేశానికి, విశాల ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.మహిళలకు చట్టసభల్లో  రిజర్వేషన్లు కల్పించాలని కోరామన్నారు. దేశ హితం, విశాల ప్రజా ప్రయోజనాలు, అణగారిన వర్గాలకు  ఉపయోగపడే అంశాలపై,  అవసరాన్ని బట్టి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు. 

 

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఈ విష‌యంలో జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం మాత్ర‌మేన‌ని ఆయ‌న అన్నారు. ఇదే మాట‌ను త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్ సైతం వెల్ల‌డించార‌ని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించామ‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటామ‌ని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: