ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి  తీవ్రమైన  గడ్డు పరిస్థితి   ఎదురవుతోంది.   తెలుగుదేశం చరిత్రలోనే  ఘోరమైన పరాజయం ఎదురవ్వడం వల్ల  ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.  పార్టీ నేతలు క్రమంగా పక్క చూపులు చూస్తున్నారు.

 

టీడీపీకి  చెందిన ఎంపీలు  బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.  తమతో టిడిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు వైసిపి నేతలు కూడా చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ టిడిపి సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

 

 తాను త్వరలోనే  భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు పెద్ది రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్షంగా బిజెపికి మాత్రమే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలువురు తెలంగాణ తెలుగుదేశం నేతలు  తమ దారి తాము చూసుకున్నారు.

 

అటు చంద్రబాబు కూడా తెలంగాణ తెలుగుదేశం పై ఆశలు వదిలేసుకున్నారు.  పార్టీకి కీలకమైన ఆంధ్రప్రదేశ్లోనూ  తెలుగుదేశం పరిస్థితి  దారుణంగా ఉన్నందువల్ల తెలంగాణపై బాబు  దృష్టి సారించే అవకాశం  ఇప్పట్లో కనిపించడం లేదు.  రమణ,   రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు తప్ప తెలంగాణ తెలుగుదేశం దాదాపు ఖాళీ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: