కేవీపీ రామ‌చంద్ర‌రావు. ఈ పేరు గురించి ప‌రిచ‌యం అవ‌సరం లేదు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆత్మ వ‌లే కేవీపీ వ్య‌వ‌హ‌రించారు. అందుకే త‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌కు స‌ల‌హాదారు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అయితే, ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారులో ఆ ప‌ద‌విని ద‌క్కించుకునేది ఎవ‌ర‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెరమీద‌కు వ‌చ్చింది. ఆ ప‌ద‌వికి త‌గిన వ్యక్తిని జ‌గ‌న్ ఇప్ప‌టికే డిసైడ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆయ‌నే మొదటి నుంచి జగన్ వెంట నిలిచిన సజ్జల రామకృష్ణా రెడ్డి.


ప‌రిపాల‌న‌లో త‌న తండ్రి త‌న‌కు స్ఫూర్తి అని పేర్కొన‌డ‌ట‌మే కాకుండా అదే రీతిలో న‌డుచుకుంటున్న జ‌గ‌న్ తండ్రి తరహాలోనే ఆప్తులకు అండగా నిలిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైసీపీ 9 ఏళ్ల పాటు పోరాడి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని అంటి పెట్టికుని ఉన్నవాళ్లు, మద్దతుగా నిలిచిన వారికి సీఎం జగన్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మొదటి నుంచి త‌న‌ వెంట నిలిచినందుకు సజ్జల రామకృష్ణా రెడ్డికి మంచి హోదా క‌ట్ట‌బెట్టార‌ని స‌మాచారం.  జర్నలిస్టిక్ నేపథ్యం ఉన్న ఆయన సాక్షి ఆవిర్భావం దగ్గర నుంచి ఆ సంస్థ బాగోగులు చూసుకుంటూ వచ్చారు.  ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వ్యవహరించి అటు టెలివిజన్ కు ఇటు పత్రికకు సజ్జల రామకృష్ణారెడ్డి ఈడీగా ద‌శాదిశ నిర్దేశించారు. ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆ సంస్థ ఉన్నతిలో కీలక పాత్ర పోషించారు.  ఆవిర్భావం దగ్గర నుంచి ఆ మీడియా ద్వారా పార్టీ  వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. వేర్వేరు జిల్లాలకు ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించిన సజ్జల… కొన్ని జిల్లాల అభ్యర్థుల ఎంపికలో కూడా జగన్‌కు కీలక సలహాలు ఇచ్చారు. ఇలా పార్టీ విజయంలో తనవంతు పాత్రను సజ్జల రామకృష్ణా రెడ్డి పోషించారు.


ఈ నేప‌థ్యంలో సజ్జల రామకృష్ణా రెడ్డికి త‌గు ప్రాధాన్యం క‌ల్పించాల‌ని జ‌గ‌న్ డిసైడ‌యిన‌ట్లు స‌మాచారం. ప‌బ్లిక్ ఎఫైర్స్ విషయంలో ప్రభుత్వ సలహాదారుగా వైఎస్ హయాంలో కేవీపీ  రామచంద్రరావు వ్యవహరించగా ఇప్పుడు అచ్చం అదే హోదాతో సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ అవకాశం లభించినట్లు సమాచారం. త్వ‌ర‌లోనే ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: