మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ ఉధృతికి చిత్తైన పెద్ద కుటుంబాలు ఇపుడు దిక్కులు తెలీక అల్లాడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీలోని పెద్ద కుటుంబాలు చాలా వరకూ గల్లంతైపోయాయి.  గడచిన 30 ఏళ్ళుగా ఎంత ప్రత్యర్ధులనైనా చిత్తు చేసిన చాలా కుటుంబాలు మొన్న మాత్రం బెంబేలెత్తిపోయాయి. అలాంటి కుటుంబాలు తాజా రాజకీయ పరిణామాలు దిక్కులు తెలీకుండా టెన్షన్ పడిపోతున్నాయి.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన జేసి, పరిటాల, కెఇ, కోట్ల, భూమా, దేవినేని కుటుంబాలకు చెందిన అనేక మంది నేతలకు ఇపుడు దిక్కులు తెలీటం లేదు. వీళ్ళంతా ఫ్యాన్ ఉధృతానికి ఒక్కసారిగా కొట్టుకుపోయారు.  చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం పోయింది. టిడిపిలో ఉంటే భవిష్యత్తుకు ఢోకా లేదన్న విషయం అర్ధమైపోయింది.

 

అందుకనే చాలామంది తమ్ముళ్ళు పక్క చూపులు చూస్తున్నారు.  జేసి సోదరులు టిడిపిలో ఉండలేక బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుంటుంబం రాజకీయ భవిష్యత్తు దాదాపు ముగిసినట్లే. రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కుటుంబం బిజెపిలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటోందట.

 

అనంతపురం జిల్లాలోని పరిటాల కుటుంబం కూడా టిడిపిలో నుండి బయటకు వచ్చేయటానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉందని సమాచారం. భూమా కుటుంబం మళ్ళీ వైసిపిలోకి చేరేందుకు జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వెళుతోందట. కెఇ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావటం లేదు. ఇక దేవినేని కుటుంబాలైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు భవిష్యత్తుపై బెంగ మొదలైందని సమాచారం.

 

పై కుటుంబాలకు చెందిన నేతలు ఏ పార్టీలో ఉన్న తమదంటూ సొంత అస్తిత్వంతో ఎన్నికల్లో ఎదురులేకుండా నెట్టుకొచ్చారు. కానీ మొన్నటి ఫ్యాన్ గాలి ఉధృతికి మాత్రం తుడిచిపెట్టుకుపోయారు. దాంతో తమకు లేదా వారసుల రాజకీయ భవిష్యత్తుపై తెగ బెంగ పడిపోతున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తున్నా పెద్ద ఉపయోగం లేకుండా పోతుందట. చూడబోతే టిడిపిలో తొందరలో సంచనాలు రేగే అవకాశాలు కనబడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: