కెసిఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాలేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది.  సుమారు 80 వేల కోట్ల రూపాయలకు పైగా  ఖర్చు చేసి   ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు.  కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో   ఇటీవలి కాలంలో  ఇంత భారీ ప్రాజెక్టును  నిర్మించడం  ఇదే తొలిసారి.

 

ఇదంతా కేవలం కెసిఆర్ పట్టుదల కార్యదక్షత  కారణంగానే  సాధ్యమైందని  టిఆర్ఎస్ నాయకులు  భావిస్తున్నారు.  అందుకే కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద  కెసిఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటికే కేసీఆర్ విగ్రహాన్ని తయారు చేసి  అంబటిపల్లి లోని  ఓ నాయకుడు ఇంట్లో ఉంచారు. 

 

భూపాలపల్లి జిల్లా  మహదేవపూర్ మండలంలోని ప్రాజెక్టు పరిసరప్రాంతాల్లో  విగ్రహం పెట్టేందుకు టిఆర్ఎస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ విగ్రహాన్ని  కాలేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన  రోజే కెసిఆర్ విగ్రహం పెట్టాలని అనుకున్నారు.  కానీ ప్రాజెక్టు పూర్తయ్యాక విగ్రహం పెడితే బాగుంటుందని  కొందరు సూచించడంతో దాన్ని విరమించుకున్నారు.

 

కెసిఆర్ విగ్రహాన్ని మెడిగడ్డ బ్యారేజ్ కి వెళ్లే మార్గంలో క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.  విగ్రహాన్ని బ్యారేజీ ప్రాంతంలో పెడతామని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత చెప్పారు.  అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు కార్యక్రమం ప్రారంభోత్సవం రోజు కాకుండా మరో రోజు ఏర్పాటు చేయాలని కూడా టిఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: