అమరావతి : ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించి, బీజేపీని బలోపేతం చేస్తామని  ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సోమవారం దీక్ష విరమించనున్న సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఆదివారం విలేకరులతో మాట్లాడి, దక్షిణాదిలో బీజేపీకి బలం లేదనడం సరికాదని విన్నవించారు.

 

కర్ణాటక, తెలంగాణలో బీజేపీకి వచ్చిన ఎంపీ సీట్లు, ఓట్లశాతం ఒక్కసారి గమనించాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుకు మంచి అవకాశం లభించినా, సద్వినియోగం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యతను బీజేపీతో పూరిస్తామని, తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని తెలిపారు.

 

దేశంలో కాంగ్రెస్‌ చరిత్ర సుమారుగా ముగిసినట్టేనని, తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలతోపాటు టీడీపీ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ‘ప్రత్యేక హోదా విషయంలో మేం ఒకటే మాట చెబుతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినంత మాత్రాన కేంద్రం వేరే విధంగా వ్యవహరించదు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఇప్పటికే సహకరించింది. ఇకపైనా సహకరిస్తుంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాది ప్రతిపక్ష పాత్ర.

 

మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పడాలని మేం పూజలు చేస్తే.. 250లోపు సీట్లు రావాలని ప్రార్థనలు చేసిన జగన్‌ మాకు మిత్రుడెలా అవుతాడు?’ మీరే ఒకసారి ఆలోచించండని ధీటుగా  ప్రశ్నించారు. ఇంక రాబోయే రోజుల్లో బి.జె.పి అన్ని చోట్ల చక్రం తిప్పుతుందని, దేశాభివృద్ధిని గమనించిన ప్రజలకు ఈ విషయం అర్ధంఔతుందని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: