చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎందుకంటే ఫ్యాన్ ప్రభావం ఇంత ఉధృతంగా ఉంటుందని ఎవరూ అనుకోలేదు.  మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలి  దెబ్బకు జనసేన పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా టిడిపికి చావు తప్పి కన్నులొట్ట పోయినట్లయిపోయింది. పోటీ చేసిన 140 సీట్లలో జనసేన గెలిచింది ఒక్కటంటే ఒక్కటే  సీటు. టిడిపి 175 స్ధానాల్లో పోటీ చేసి 23 సీట్లలో గెలిచింది. ఈ లెక్కలు చూస్తేనే ఫ్యాన్ గాలి ఎంత ఉధృతంగా వీచిందో అర్ధమైపోతుంది.

 

సరే జగన్మోహన్ రెడ్డి సిఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హామీల అమలుపై దృష్టి పెట్టారు. అవకాశం ఉన్నంతలో ప్రతీ హామీ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో టిడిపి, జనసేనలో సమస్యలు మొదలయ్యాయి. చంద్రబాబు, పవన్ నాయకత్వంపై ఆయా పార్టీల నేతల్లో నమ్మకాలు పోతున్నాయి. అందుకనే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

 

 

అధికారం లేకుండా టిడిపి నేతలు అస్సలు ఉండలేకపోతున్నారు. అందుకనే కుదిరితే వైసిపి లేకపోతే బిజెపిలోకి దూకేసేందుకు రెడీ అయిపోతున్నారు. కాకపోతే వైసిపిలో కష్టమనుకున్న వారిలో ఎక్కువమంది బిజెపి వైపు చూస్తున్నారు.  నిజానికి టిడిపి నుండి వచ్చే వారిని చేర్చుకునే అవసరం వైసిపికి ఏమాత్రం లేదు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేయటం బిజెపికి చాలా అవసరం.

 

మొన్నటి ఎన్నికల్లో బిజెపి పోటీ చేసిన 175 స్ధానాల్లో డిపాజిట్ వచ్చిన సీట్లు చెప్పమంటే ఆ పార్టీ నేతలే చెప్పలేరు. ఇతర పార్టీల్లో బలమైన నేతలను చేర్చుకుంటే కానీ వచ్చే ఎన్నికల్లో బిజెపి కనీసం కొన్ని సీట్లలో అయినా గట్టి పోటీ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అందుకనే చేరికలకు బార్లా గేట్లు తెరిచేసింది.  మొన్న గెలిచిన ఎంఎల్ఏల్లో కొందరితో పాటు జేసి, భూమా, కోట్ల, కెఇ, టిజి కుటుంబాలు టిడిపిని వీడటం ఖాయమట.

 

అదే సమయంలో మొన్నటి ఎన్నికల తర్వాత జనసేనకు చాలామంది నేతలు గుడ్ బై చెప్పేశారు. అంటే ఉన్న వాళ్ళకన్నా వాళ్ళేమీ బలమైన నేతలని కాదులేండి. పార్టీలో ఉన్న వాళ్ళల్లో చాలామంది తొందరలో రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారట. నేతలు పార్టీలను వీడిపోతే  టిడిపితో పోల్చుకుంటే జనసేనకు జరిగే నష్టం తక్కువే లేండి. ఏదేమైనా ఫ్యాన్ గాలి ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ అనుకోలేదన్నది మాత్రం వాస్తవం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: