హైద‌రాబాద్‌లో సంచ‌ల‌న బెదిరింపు క‌ల‌క‌లం చోటు చేసుకుంది. రూ.18 కోట్లు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ ఓ ప‌త్రికాధిప‌తిని బెదిరించారు. స‌ద‌రు వ్య‌క్తి ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశారు. దుర్భాష‌లాడుతూ...ర‌చ్చ‌రచ్చ‌ దీంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇలా ఇబ్బందుల్లో ప‌డింది దక్కన్ క్రానికల్ చైర్మన్ టీ వెంకట్రాంరెడ్డి కుటుంబం. కాగా, స‌ద‌రు  ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసు లు అరెస్ట్‌చేశారు. వీరిలో ఒకరు ఆస్ట్రేలియా పౌరుడు.


బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని టీ వెంకట్రాంరెడ్డి ఇంటికి శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇద్దరువ్యక్తులు వచ్చి వెంకట్రాంరెడ్డి గురించి సెక్యూరిటీ గార్డు కృష్ణను వాకబు చేశారు. విషయాన్ని వెంకట్రాంరెడ్డి భార్య మంజులారెడ్డికి సెక్యురిటీ గార్డు తెలిపాడు. తన భర్త హైదరాబాద్‌లో లేరని చెప్పగా.. సదరు ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడుతూ తమకివ్వాల్సిన రూ.18 కోట్లు ఇవ్వకపోతే అంతుచూస్తామంటూ బెదిరించారు. ఇంటి ఫొటోలు తీస్తూ హల్‌చల్ చేశారు. కొంతసేపటి తర్వాత అక్కడనుంచి వెళ్లిపోయిన వారు.. రాత్రి వరకు మంజులారెడ్డికి ఫోన్లు చేస్తూ పలుమార్లు బెదిరించారు. ఈ మేరకు వెంకట్రాంరెడ్డి కుమారుడు విజయ్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. బెదిరింపులకు దిగినవారిలో ఒకరు చెన్నై నుంచి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లి స్థిరపడిన పోన్ విశాకన్ అలియాస్ నిక్, మరొకరు చెన్నైకి చెందిన రాకేశ్‌రాజ్‌గా గుర్తించారు. వెంకట్రాంరెడ్డితో వీరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపై స్పష్టత కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే బెదిరింపులకు దిగివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరో తమకు తెలియదని వెంకట్రాంరెడ్డి కుటుంబసభ్యులు చెప్తున్నట్టుగా తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: