రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు వారాలు మాత్ర‌మే గ‌డిచింది. ఎన్నాళ్లుగానో వేచిన అధికారం జ‌గ‌న్‌కు సొంతం అయింది. అయితే, మొద‌ట్లో జ‌గ‌న్ టీం ఈ విష‌యంపై చాలా ఆనందం వ్య‌క్తం చేసినా.. ఇప్పుడు రోజులు గ‌డుస్తున్న కొద్దీ కూడా ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తారు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు పాల‌న‌ను చాలా ద‌గ్గ‌ర‌గా చూసిన జ‌గ‌న్‌.. పాల‌న ఎలా ఉంటే ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతామో గ్ర‌హించారు. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు?  బాబు ఎలా పాలించారు? అనే విష‌యాల‌ను ఆయ‌న గ్ర‌హించి వాటిలోని మంచి చెడుల‌ను భేరీజు వేసుకుని ఆది నుంచి పాల‌న‌ను పాద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. 


అయితే, ఈ ప‌రిస్థితి ఇప్పుడు జ‌గ‌న్‌ను పార్టీలో ఒంట‌రిని చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంద‌రు సీనియ‌ర్లు.. త‌మ మ‌న‌సులోని మాట‌ల‌ను మీడియా స‌హ‌చ‌రుల‌తో పంచుకుంటున్నారు. ``మా నాయ‌కుడు అవినీతి లేకుండా చూడాల‌ని అంటున్నారు. నిజ‌మే! మేం కూడా దానికి కంక‌ణం క‌ట్టుకుంటాం. కానీ, ఇప్ప‌టికే తొమ్మిదేళ్లు ఆయ‌న కోసం, పార్టీ కార్య‌క‌ర్త‌ల కోసం ఎంతో ఖ‌ర్చు చేశాం. మ‌రి మా ఆర్థిక ప‌రిస్థితిని కూడా ఆయ‌న ప‌ట్టించుకోవాలి క‌దా. 


ఎమ్మెల్యేగా మాకు వ‌చ్చే జీతం 50 వేల‌తో ఎలా నెట్టుకు రావాలీ. ఏదైనా ఒక్క స‌మావేశం పెడితేనే టీ, స్నాక్స్ ఖ‌ర్చులే 20 వేల‌కు పైగానే అవుతోంది. అలాంటి స‌మ‌యంలో ఇలాంటి ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీస్తే ఎలా`` అని వారు అంటున్నారు. ఇక‌, కీల‌క ప‌ద‌వుల్లో లేనివారు మ‌రో విధంగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ``మేం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేశాం. ఇప్పుడు క‌నీసం మ‌మ్మ‌ల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇలా అయితే, మేం కేడ‌ర్‌ను ఎలా బ‌తికించుకోవాలి?`` అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త లేక పోయినా.. ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, అవినీతి ర‌హిత పాల‌న‌, మ‌ద్య నిషేధం వంటి విష‌యాల‌ను త‌లుచుకుంటే మాత్రం దిగువ స్థాయి నాయ‌కుల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. 


ఈ క్ర‌మంలో ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడుతూనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాము ఆర్థికంగా ఎలా ఎద‌గాల‌నే విష‌యాన్ని అధినేత దృష్టికి తీసుకు వెళ్లాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఇలాంటి చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌డం వైసీపీ వ‌ర్గాల్లో ఆశ్చ‌ర్యం వ్య‌క్తమ‌వుతోంది. నాయ‌కుల్లో ఒక‌రిద్ద‌రు ఇలాంటి అసంతృప్తులు వ్య‌క్తం చేసినా అదే టైంలో జ‌గ‌న్ తీసుకున్న అవినీతిర‌హిత పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు వ్య‌క్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: