కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. వికారాబాద్ జిల్లాలోని పార్టీలోని ముఖ్యనేతలంతా ఇతర పార్టీలవైపు చూస్తున్న త‌రుణంలో...జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒక‌రు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజ‌కీయ గురువుగా పేర్కొనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ మాజీ ఎంపీ బీజేపీతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.


వికారాబాద్ జిల్లాకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరడానికి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న సదరు మాజీ ఎంపీపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యంగా చేసుకొని అడుగులు వేస్తోంది. తన వ్యాపారానికి ఇబ్బందులు సృష్టిస్తోందని... తనపై కేసులను నమోదు చేస్తోందని సదరు మాజీ ఎంపీ తన అనుచరుల వద్ద వాపోతున్నారు. ఈ పరిస్థితులలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని సదరు మాజీ ఎంపీ యోచిస్తున్నారు. బీజేపీలో చేరికకు సంబంధించి స‌ద‌రు మాజీ ఎంపీ ఒక దఫా చర్చలు కూడా జరిపినట్లు రాజకీయ పక్షాలలో చర్చ సాగుతోంది.


లోక్‌సభ ఫలితాల తరువాత కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల మనోస్థైర్యం బాగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుండ‌టం...త‌న అనుచ‌రుడైన ఎమ్మెల్యే పార్టీ మారడం..త‌న వ్యాపారాల‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న త‌రుణంలో...ఆ ఎంపీ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చేరిక‌తో కాంగ్రెస్‌కు గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్లేన‌ని చ‌ర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: