ఆంధ్ర‌ప్ర‌దేశ్‌- తెలంగాణ మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాల్లో కీల‌క ముంద‌డుగు ప‌డ‌నుంది. పొరుగు రాష్ట్రమైన‌ తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌తో తమకు అవసరం లేదని భావించి భవనాలను అప్పగించడానికి ముందుకు వచ్చారు. దీంతో సచివాలయంతోపాటు ఇతర భవనాల అప్పగింత ప్రక్రియ వేగం అందుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు కీలకమైన భవనాల అప్పగింత కార్యక్రమం చేపట్టనున్నారు. 


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పాలన కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వానికి సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు రాజధానిలో మరికొన్ని భవనాలను ఆ రాష్ర్టానికి కేటాయించారు. కానీ, ఏపీ ప్రభుత్వం 2016 నుంచే తన కార్యకలాపాలను అమరావతి నుంచే ప్రారంభించింది. అధికారులంతా అమరావతికి తరలివెళ్లారు. ఫైళ్లతోపాటు వివిధ రకాల సామగ్రినంతటినీ తీసుకువెళ్లారు. దీంతో అప్పటినుంచి ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నాటినుంచి భవనాలను అప్పగించాలని తెలంగాణ కోరుతూ వచ్చింది. కానీ, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వాటిని అప్పగించేందుకు ముందుకురాలేదు. ఇటీవల ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న భవనాలు అవసరం లేదని భావించింది. ఈ మేరకు తెలంగాణకు అప్పగించడానికి ముందుకువచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకొని ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి స్నేహహస్తం అందించడంతో ఈ మేర‌కు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.


సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లను తెలంగాణకు అప్పగించనున్నారు. స‌చివాలయంలో ఏపీకి కేటాయించిన కే బ్లాక్‌లో పోస్టాఫీస్, బ్యాంకు, వైద్యశాల ఉన్నాయని, దీంతో ఈ బ్లాక్‌ను తెలంగాణకు అప్పగించినట్టేనని ఏపీ అధికారులు తెలిపారు. ఎల్ బ్లాక్, జే బ్లాక్‌లతోపాటు హెచ్ సౌత్‌బ్లాక్‌ను సోమవారం సాయంత్రం వరకు అప్పగిస్తామని పేర్కొన్నారు. హెచ్ నార్త్‌బ్లాక్‌లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉన్నది. హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఇతర శాఖాధిపతుల కార్యాలయాల భవనాలను కూడా అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏపీ డీజీపీ కార్యాలయం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ తెలంగాణ చేతికి రానున్నాయి. అయితే ఎర్రమంజిల్‌లో ఉన్న సాగునీటి పారుదలశాఖ కార్యాలయాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.


మ‌రోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు.  సచివాలయంలోని అన్ని బ్లాకులు తెలంగాణ ఆధీనంలోకి రానుండటంతో ఈ నెల 27న నూతన సచివాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: