ధర్మపోరాట దీక్షల పేరుతో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రూ.500 కోట్లు దోచేశారని ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీలో ఆరోపించిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టీడీపీ నేతలు ఇష్టానుసారం పెంచేశారనీ, నీరు-చెట్టు పథకం కింద రూ.18,000 కోట్లు దోచుకున్నారని ఈరోజు విమర్శించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కలుగ చేసుకున్నారు.

 

తమకు అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని విషయాల్లో తాము ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. ‘అధ్యక్షా.. మా పరిస్థితి ఎలా అయిందంటే.. అదృష్టం కొద్ది ఎలాంటి అనుభవం లేని ఓ వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయి, మా చంద్రబాబు కే నీతులు చెబుతుంటే బాధగా అనిపిస్తోంది. దెయ్యాలు వేదాలు చెబుతున్నాయి అధ్యక్షా అని మొరపెట్టుకున్నారు.

 

నిజంగా బాధగా అనిపిస్తోంది. రాష్ట్ర సమస్యలపై ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ నిన్న కాక మొన్న ఇరిగేషన్ మంత్రిగా అయి చంద్రబాబు నాయుడికే ఇరిగేషన్ మీద పాఠాలు చెబుతుంటే కొంచెం బాధగా అనిపిస్తోంది అధ్యక్షా’ అని వ్యాఖ్యానించారు. "కూత నేర్చిన కోడి ఇంటిపైకెక్కి కూసిందట" అని చమత్కరించగా సభలో అందరు ఒక్కసారిగా గొల్లు మన్నారు.

 

అయితే, అతని వ్యాఖ్యలకు ధీటుగా అనిల్ కుమార్ "ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా" అని సినీ ఫక్కీలో డైలాగులు చెప్పారు.  ఏది ఏమైనా వై.యస్.ఆర్.సి.పి మంత్రులు మరియు కార్యకర్తలు కొంచెం అలోచించి మాట్లాడితే సభలో మంచి వాతావరణమేర్పడుతుందని జనుల కాంక్ష, ఆకాంక్ష!


మరింత సమాచారం తెలుసుకోండి: