ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. జూన్‌ 18వ తేదీన ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుందని ఆయన వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి ప్ర‌జ‌ల దృష్టి అధికార వైసీపీ, విప‌క్షం టీడీపీల‌పై ప‌డింది. విష‌యంలోకి వెళ్తే.. స్పీక‌ర్ ప‌ద‌విని అధికార పార్టీకి చెందిన స‌భ్యుడికి ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 


అయితే, దీనికి కూడా ప్ర‌తిప‌క్షం నుంచి పోటీ ఉన్న సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ, సాధార‌ణంగా అధికార పార్టీకే బ‌లం ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి.. ఆ పార్టీ సూచించిన అభ్య‌ర్థే స్పీక‌ర్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆముదాల‌వ‌లస ఎమ్మెల్యే త‌మ్మినేని సీతారాంను ఏక‌గ్రీవంగా ఎన్నుకుని స్పీక‌ర్‌ను చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రో క్ర‌తువుకు అసెంబ్లీ సిద్ధ‌మైంది. డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రెడీ అయింది. ఈ ప‌ద‌విని సాధార‌ణంగా గ‌తంలో ఆన‌వాయితీగా విప‌క్ష స‌భ్యుల‌కు కేటాయించేవారు. ఇప్ప‌టికీ పార్ల‌మెంటులోని లోక్‌స‌భ‌లో ఈ సంప్ర‌దాయాన్ని పాటిస్తున్నారు. 


తెలుగు రాజ‌కీయాల్లోనూ చాలా వ‌ర‌కు ఇదే సంప్ర‌దాయం కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. అయితే, చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో ఈ సంప్ర‌దాయ‌న్ని ప‌క్క‌న పెట్టి.. త‌న పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌కు ఛాన్స్ ఇచ్చారు. స్పీక‌ర్‌గా సీనియ‌ర్ నేత‌, త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకు ఛాన్స్ ఇచ్చిన బాబు.. డిప్యూటీ స్పీక‌ర్‌గా కాపు వ‌ర్గానికి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కు ఛాన్స్ ఇచ్చారు.


ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ పాత సంప్ర‌దాయాల ప్ర‌కారం డిప్యూటీగా విప‌క్షం నుంచి స‌భ్యుడికి అవ‌కాశం ఇస్తారా?  లేక సంఖ్యా బ‌లం ఎక్కువ‌గా ఉన్నందున త‌న స‌భ్య‌ల్లో ఒక‌రికి అవ‌కాశం ఇస్తారా ? అనేది వేచి చూడాలి. ఇక‌, ఈ డిప్యూటీ స్పీక‌ర్ రేసులో గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎమ్మెల్యే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన కోన ర‌ఘుప‌తి పేరు బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో ర‌ఘుప‌తి తండ్రి కోన ప్ర‌భాక‌ర్‌రావు స్పీక‌ర్‌గా ప‌నిచేసిన నేప‌థ్యం, బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి కేబినెట్‌లో అవ‌కాశం ఇవ్వ‌ని నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని కోన‌కు క‌ట్ట‌బెట్ట‌డం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: