ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తున్నాయి. వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేసుకోవడంతో పాటు వారిలో ఏకంగా నలుగురు మంత్రి పదవులు కట్టబెట్టిన‌ చంద్రబాబుకు ఇప్పుడు అదే విషయంలో రివ‌ర్స్ అనుభవం ఎదురవుతోంది. ఇక తాజా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టిడిపి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది గోడదూకేస్తున్నారంటూ వార్తలు ఒకటే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పచ్చ మీడియా అదిగో పులి ఇదిగో మేక అన్న చందంగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారు అంటూ పదే పదే వార్తలు ప్రచురించింది. చంద్రబాబుకు చెక్కభజన చేసే ఓ పత్రిక అయితే ప్రతిరోజూ ఇదే వార్తను బ్యాన‌ర్‌గా ప్రచురించేది. ఇప్పుడు సహజంగానే వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మిగలడంతో సాక్షి అనుకూల వర్గాలు కూడా ఇదే తరహా వార్తలు ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు వైసిపిలోకి వెళ్లిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. 


విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో ఇంటర్నల్ గా నడుస్తున్న చర్చ‌ల ప్రకారం వైసీపీ చెబుతున్న‌ట్టుగా  ప‌ది మంది ఎమ్మెల్యేలు కాదు గాని... ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మార‌తార‌ని చంద్ర‌బాబుకే అనుమానాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎవరెవరు పార్టీ మారతారు అన్నదానిపై చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లతో ఓ కమిటీ వేశారట. ఈ కమిటీ కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకుని ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే మారవచ్చని చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. 


విశాఖ నగరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటాతో సహా నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మార‌తార‌ని అంటున్నారు. కొందరు వైసీపీ వైపు చూస్తూ ఉంటే మరికొందరు బిజెపి వైపు చూస్తున్నారు. ఇక జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నా కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. వంశీకి నేరుగా జగన్‌తోనే పరిచయంతో పాటు మంత్రి కొడాలి నానికి సన్నిహితుడు కావడంతో వంశీ కూడా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. చంద్రబాబుకు ఉన్న తక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఎవరు .. ఎప్పుడు జంప్ చేస్తారో ? అర్థం కాని పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: