శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో అడవి ఏనుగులు బీభత్సం సృష్టంచాయి. సీతంపేట సమీప మండ పంచాయితీ ఈతమానుగూడ గ్రామ జీడిమామిడి తోటలోకి చొరబడ్డ ఏనుగుల గుంపు అక్కడ ఉపాధికోసం జీడిపిక్కలను ఏరుతున్న వారిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు దక్కించుకోగా సవర గైయ్యారమ్మ (62) ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయింది.
 
గాయాలపాలైన కొందరిని శ్రీకాకుళం రిమ్స్‌ హాస్పిటల్‌ కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఇదే దాడిలో తీవ్రగాయాలపాలైన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మండ పంచాయితీ పరిధిలో పొలం పనులు చేస్తున్న మరికొందరిపై ఏనుగుల గుంపు దాడిచేసింది. ఈ ఘటనలో బోడమ్మ అనే మరో మహిళ తీవ్రగాయాలపాలై విషమ పరిస్థితిలో ఉంది. 

విషయం తెలుసుకున్న పారెస్ట్‌ అధికారులు ఈతమానుగూడ గ్రామంలో సంచరిస్తున్న ఏనుగులను స్థానికుల సహాయంలో బెదిరించి వాటిని తిరిగి అడవుల్లోనికి వెళ్లగొట్టారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డవారిని స్థానికి నాయకులు పరామర్శించారు. అడవి ఏనుగుల దాడులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులు సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: