కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో వైద్యుల సమ్మె ఉద్రిక్తంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వైద్యుల డిమాండ్‌ మేరకు సీఎం మమతాబెనర్జీతో జరిగే సమావేశం మొత్తాన్ని రికార్డు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు బెంగాల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ సమ్మె చేస్తున్న జూనియర్‌ వైద్యులకు రాసిన ఓ లేఖలో వెల్లడించింది.

 

సోమవారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఆ లేఖలో పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలోని ప్రతి మెడికల్‌ కళాశాల నుంచి ఇద్దరు చొప్పున వైద్యులతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అంగీకరించారు. మీ డిమాండ్లపై సీఎం మీతో చర్చలు జరుపుతారు.

 

అంతేగాక.. ఈ సమావేశమంతా రికార్డు చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. చర్చలో పాల్గొనే వైద్యులు 2.30 గంటలకు సచివాలయానికి రావాలి’ అని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ లేఖలో పేర్కొంది. కాగా, ఈ సమావేశాన్ని కూడా బహిష్కరించాలని జూనియర్‌ వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంతో సమావేశాన్ని జాతీయ మీడియా సమక్షంలో రికార్డు చేయాలని వైద్యులు కోరారు.

 

అయితే దీనికి అక్కడి ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సమాచారం. మరోవైపు కోల్‌కతాలోని  వైద్యుల సమ్మెకు మద్దతుగా సోమవారం దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా సాధారణ సేవల సిబ్బంది ఈ ఉదయం 6 గంటల నుంచి విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: