ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా రూపొందిన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధపాత్రిపదికన మూడేళ్ల‌లోనే నీటి విడుదలకు సిద్ధం చేశామ‌ని పేర్కొంటూ...ఈ నెల 21 ప్రారంభోత్స‌వానికి తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్వం సిద్ధం చేసు్త‌న్న సంగ‌తి తెలిసిందే. ఏటా సముద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాల్ని బీడుభూముల్లోకి మళ్లించడం ద్వారా దశాబ్దాలుగా గోస తీస్తున్న తెలంగాణ రైతాంగానికి శాశ్వత ఉపశమనం కలిగించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అయితే, ఈ ప్రాజెక్టు ప్రారంభించ‌డం వెనుక లెక్క‌లు వేరేన‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఓట‌మి అవ‌మాన భారం నుంచి దృష్టి మ‌ళ్లించేందుకే...ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. 

 

 

హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కేసీఆర్.. ఓటమి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పడ్డారన్నారు. 15% పనులు కూడా పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవ కార్యక్రమం గందరగోళంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని  లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

 

 

కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని ల‌క్ష్మ‌ణ్ అన్నారు.  దేశంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 11 కోట్లకు చేరుకుందని,  ప్రస్తుతం  రాష్ట్రంలో కూడా బీజేపీకి 15 లక్షల సభ్యత్వం ఉందని అన్నారు. ఈ నెల 6 వ తేది నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని,  ఈ సారి రాష్ట్రంలోకనీసం 20% సభ్యత్వాన్ని అదనంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కనీసం 5 లక్షల మందిని పార్టీలో చేర్పిస్తామని లక్ష్మణ్ అన్నారు. ఈ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయమని  కాంగ్రెస్ చెబుతోంది కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్ సరుకు హోల్ సేల్ గా అమ్ముడు పోయిందని లక్ష్మణ్ అన్నారు. కుళ్ళిపోయిన ఆ పార్టీకి చికిత్స చేసే అవకాశం కూడా లేదన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విదేశాల్లో సేద తీరేందుకు వెళ్లారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: