ఇప్పటి వరకు ఎండవేడిమితో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. జూన్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడాల్సి ఉన్న కేరళ తీరాన్ని రుతుపవనాలు పక్షంరోజులు ఆలస్యంగా తాకడంతో ఏపీలో కూడా వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 18న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన రానున్న రెండు మూడు రోజుల్లో అవి రాష్ట్రంలో విస్తరిస్తాయని చెప్పిన అధికారులు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రానున్న రోజుల్లో బలపడుతుందని చెప్పారు. ఈ తరహా వాతావరణం ఏర్పడినప్పుడు ఆకాశంలో మబ్బులు పెరిగిపోతాయని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా వర్షాలు కురవడం ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇక ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వర్షాలు కురిసే సమయంలో భారీగా గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ.


మొత్తానికి అప్పుడప్పుడు కురిసే వర్షాలు తప్ప పూర్తిస్థాయిలో వర్షాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కురవలేదు. తాజాగా వాతావరణ శాఖ వర్షాలు పడుతున్నాయని కబురు చెప్పడంతో ఇటు సాధారణ ప్రజలు అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు వర్షం కోసం కళ్లు కాయలయ్యేలా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వర్షాలు వస్తాయన్న ఆశతో రైతులు తమ పంటకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇక ఈ వేసవి కాలమంతా ఎండవేడిమితో అల్లాడిపోయిన ప్రజలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: