రాజ‌కీయాల్లో స‌న్యాసం తీసుకోవ‌డం అనేది మ‌నం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర విభ‌జ‌న‌తో చాలా మంది సీనియ‌ర్ నాయ‌కు లు రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతే.. రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ పైర్ బ్రాండ్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప్ర‌తిజ్ఞ చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీ.. దెందులూరులో పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని, వారి క‌ష్టాల‌ను త‌న క‌ష్టాలుగా భావిస్తాన‌ని హామీ ఇచ్చిన కొఠారు అబ్బ‌య్య చౌద‌రి హామీల కార‌ణంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు వైసీపీని గెలిపించారు. మ‌రి ఈక్ర‌మంలో ఇప్పుడు చింత‌మ‌నేని ఏం చేయాలి? స‌న్యాసం తీసుకోవాలా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. 


అయితే, ఇదే ప్ర‌శ్న‌ను ఇక్క‌డ నుంచి గెలిచిన కొఠారును ప్ర‌శ్నించిన‌ప్పుడు.. ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాడో లేదో త‌న‌కు తెలియ‌ద‌ని, ద‌మ్ముంటే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీకి రావాల‌ని..త‌న స‌త్తా ఏంటో చూపించి, మ‌ట్టి క‌రిపిస్తాన‌ని తాజాగా ఆయ‌న స‌వాల్ రువ్వారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో త‌న‌పై అవాకులు, చ‌వాకులు పేలుతున్న చింత‌మ‌నేని ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని కూడా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొఠారు వార్నింగ్ ఇచ్చారు. 


అంతేకాదు, దివంగ‌త వైఎస్ ఆయ‌న త‌న‌యుడు, సీఎం జ‌గ‌న్‌పై చింత‌మ‌నేని చేస్తున్న విమ‌ర్శ‌ల‌పైనా తీవ్రంగా స్పందించాడు కొఠారు. ఇక‌పై జ‌గ‌న్ ను కానీ, వైఎస్‌ను కానీ విమ‌ర్శిస్తే.. జైలుకు వెళ్లేందుకు చింత‌మ‌నేని రెడీగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేగా ఉంటూ.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి. అవినీతి కి పాల్ప‌డి, ఇసుక మాఫియాను చేతిలో పెట్టుకుని ప్ర‌జ‌ల సొమ్మును కాజేసిన చింత‌మ‌నేనిపై ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా ప్ర‌య‌త్నించి అవినీతి సొమ్మును రాబ‌డ‌తామ‌ని కొఠారు వెల్ల‌డించారు. 


త‌న‌కు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలోనే సంతృప్తి ఉంద‌ని, అందుకే ఏడాదికి రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల జీతాన్ని ఇచ్చే ఉద్యోగం వ‌దులుకుని ఇక్క‌డ రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని వెల్ల‌డించిన కొఠారు... త‌న ప్రాణం తుది శ్వాస వ‌ర‌కు కూడా తాను జ‌గ‌న్‌కు అండ‌గానే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. వేరే పార్టీల నుంచి వ‌చ్చే ఆఫ‌ర్ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మొత్తానికి రాజ‌కీయ అనుభ‌వ ప‌రంగా పిట్ట చిన్న‌దే అయినా కూత మాత్రం ఘ‌నంగా ఉంద‌నిఅంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: