సకల జనుల ముందు అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. జగన్ అంటే నాకు పరమ ప్రాణం. ఆయన కోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు శ్రమించింది. శారదా పీఠం జగన్ అంటే ప్రాణం పెట్టింది. అక్కడ దేన్ని కదిపినా.. జగన్ గెలవాలి, రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంది. ఇటు జగన్, అటు కేసీఆర్ 15 ఏళ్లు దిగ్విజయంగా తెలుగు రాష్ట్రాలను పాలించాలని కోరుకుంటున్నా. అంత వరకు శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది.

విజయవాడలో ఉత్తరాధికారి నియామకం జరపాలని 45 రోజుల క్రితం నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి నాకు అత్యంత ఇష్టమైన కేసీఆర్, జగన్ వస్తారని మా కమిటీకి అప్పుడే చెప్పాను. మే 23న ఎన్నికల ఫలితాలకు ముందే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపారు. కేసీఆర్ను స్వయంగా నేనే ఆహ్వానించాను. భవిష్యత్తు తెలియజేసే ఏకైక పీఠం శారదా పీఠమే. అధర్మం ఓడుతుంది, ధర్మం గెలుస్తుందని శారదా పీఠం గ్రహించింది. జగన్, కేసీఆర్ మాట తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని స్వరూపానంద సరస్వతి చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పీఠాల్లో విశాఖ శారదాపీఠం ఒకటనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్లకు ఈ పీఠాధిపతి స్వరూపంద సరస్వతి ఆశీస్సులు ఉన్నాయి. శారదాపీఠం ఆశీస్సులు ఉన్న కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కావడం, జగన్ ఏపీలో అద్భుత విజయంతో అధికారంలోకి రావడంతో ఈ పీఠానికి రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది. శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్కుమార్ శర్మ సన్యాస దీక్షా స్వీకార మహోత్సవం రెండు రోజుల కిందట విజయవాడలో ప్రారంభమైన విషయం తెలిసిందే. 

కృష్ణా నదీ తీరంలోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శాస్త్రోక్తంగా దీనిని నిర్వహించారు. సోమవారం సన్యాసదీక్ష ముగింపు కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ పాల్గొన్నారు. సన్యాస దీక్ష స్వీకరించిన కిరణ్ కుమార్ శర్మకు స్వాత్మానందేంద్రగా విశాఖ పీఠాధిపతి నామకరణం చేశారు. 2024లో తన స్థానంలో స్వాత్మానందేంద్ర పీఠాధిపతి బాధ్యతలు చేపడతారని స్వరూపానంద ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: