యావత్ ప్రపంచానికి భారత్ ఇచ్చిన కానుక యోగా. నిత్యం యోగాసనాలు వేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటాం. సహజంగా 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. యోగా డే సమీపిస్తోన్న వేళ, యోగాను జీవితంలో భాగం చేసుకోండని లింక్డ్‌ఇన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సందేశం ఇచ్చారు.

 

యోగా, ధ్యానం అనేది కేవలం ఎక్స‌ర్‌సైజ్ మాత్రమే కాదని, ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడుతుందని ప్రధాని తెలిపారు. నేను నుంచి మనంగా మారడానికి, శరీరం, మనసు మధ్య సమన్వయానికి, వివేకం పెరగడానికి యోగా దోహదం చేస్తుందన్నారు. యోగా వల్ల ఐక్యమత్యం అలవడుతుందన్నారు. యోగాతో ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయన్నారు.

 

యోగా చేయడం చాలా సులభమని, అనువుగానూ ఉంటుందన్న మోదీ.. ఈ ప్రక్రియకు పరికరాలు, పెద్ద మైదానం లాంటి అవసరం లేదన్నారు. ఆసనాలు వేయడానికి శ్రద్ధతోపాటు కొంచెం ఖాళీ స్థలం, ఓ చాప ఉంటే చాలన్నారు. ఉదయాన్నే యోగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందన్న ప్రధాని.. చిన్నపాటి విరామ సమయాల్లోనూ యోగా చేయొచ్చన్నారు.

 

ఉద్యోగ రీత్యా పై స్థాయికి చేరుకునే కొద్దీ, ఒత్తిడి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. లక్ష్యాలను చేరుకోవడం, తీరిక లేని ప్రయాణాలు ఇవన్నీ మీ శరీరాన్ని, మనసును ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వారికి యోగా, ధ్యానం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయని, ఒత్తిడి దూరం అవుతుందని మోదీ తెలిపారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను యోగాతో దూరం చేయొచ్చన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: