తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ సార‌థ్యంలో...నేడు రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత‌ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలపై మంత్రివర్గం చర్చించనుంది. లక్షలోపు రుణమాఫీ అమలుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల పెంపు ఉత్తర్వులను మంత్రిమండలి ఆమోదించనుంది. అలాగే కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 


ప్ర‌ధానంగా కొత్తగా రూపొందించిన పురపాలక చట్టం, రెవెన్యూ చట్టంలో మార్పులు, చేర్పులపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త మున్సిపల్ చట్టానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతోపాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరుగనున్నది. నూతన సచివాలయ భవన నిర్మాణం ప్లాన్‌పైనా చర్చిస్తారని సమాచారం. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచే విషయానికి ఆమోదం తెలుపనుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడు టీఎంసీలను తరలింపునకు కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల వద్ద అదనపు మోటర్ల బిగింపునకు సుమారు రూ.1,250 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించాలని స్టాండింగ్ కౌన్సిల్ సిఫారసుచేసింది. దీనిపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారు. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు అదనపు టీఎంసీ తరలింపు, ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరదకాల్వ వరకు రెండు టీఎంసీల తరలింపునకు పనులు పూర్తయ్యాయి. కానీ మూడో టీఎంసీని పైప్‌లైన్ ద్వారా తరలించాలా? లేక రిజర్వాయర్‌ను ఏర్పాటుచేయాలా? అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నదని సమాచారం.


 22 కొత్త జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు, టీఎస్‌ఎస్పీఎఫ్‌కు ఎనిమిది ఎకరాలు, నేషనల్ పోలీస్ అకాడమిలో క్వార్టర్ల నిర్మాణానికి రెండెకరాలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి ఐదెకరాలు కేటాయింపుపై చర్చిస్తారని తెలుస్తోంది. వీటితోపాటు తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెట్ రిలీఫ్- 2019 సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేస్తుందని సమాచారం. కేఎంసీ వరంగల్, రిమ్స్ ఆదిలాబాద్‌కు 636 పోస్టులు సృష్టించే ఫైలుపైనా మంత్రివర్గం చర్చించనుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 14 మంది జీవితఖైదీలకు స్పెషల్ రెమిషన్ ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: