గంగా న‌దిలో లైవ్ స్టంట్‌తో ఆక‌ట్టుకోవాల‌నుకొని ప్ర‌య‌త్నం చేసిన ఓ మెజీషియ‌న్ క‌నిపించ‌కుండాపోయాడు. స‌ద‌రు ఇంద్రజాలికుడి సాహస యత్నం అతని ప్రాణాల మీదికి తెచ్చింది. కాళ్లు, చేతులు కట్టేసుకొని, కండ్ల కు గంతలు కట్టుకొని ఓ ఇనుప బోనులో హుగ్లీ నదిలోకి దిగిన మెజీషియన్ చంచల్ లాహిరి (40) బయటకు రాలేదు. దీంతో అతడు నదిలోనే గల్లంతయ్యాడని, ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని భావిస్తున్నారు. దక్షిణ కోల్‌కతా వాసి లాహిరి 2013లోనూ హుగ్లీ నదిలో ఇదే సాహసం చేసి.. విజయవంతంగా తన బంధనాలను తెంచుకొని బయటకు వచ్చాడు. లాహిరిని ఈసారి దురదృష్టం వెన్నాడింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం.. లాహిరి ఆదివారం మధ్యాహ్నం చిన్న పడవలో నదిలోకెళ్లాడు. అతని సహాయకులు లాహిరి కళ్ల‌కు గంతలు కట్టారు. ఆయన కాళ్లు, చేతులూ కట్టేసి, ఓ బోనులోకి అతడిని దించారు. ఆరడుగుల పొడవున్న బోనుకు ఆరు తాళాలు వేశారు. దానిని హౌరా బ్రిడ్జిపై ఉన్న క్రేన్ సాయంతో నదిలోకి దించారు. నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పంజరం నదిలో పడగానే లాహిరి తన బంధనాలను ఛేదించుకొని నీటిపై తేలాలి. హౌరా వంతెనకున్న 28వ పిల్లర్ వద్ద నుంచి లాహిరి బోన్ పైకెత్తిన క్రేన్.. అక్కడే నదిలో పడేసింది. కానీ పది నిమిషాలైనా లాహిరి బయటకు రాకపోవడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. ప్రేక్షకుల్లో ఒకరు సమాచారమందించడంతో విపత్తు సహాయ బృందం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నలుగురు గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు హ్యారీ హౌడిని వందేళ్ల‌ క్రితం బంధనాలను తెంచుకొని తప్పించుకొనే ఈ సాహస క్రీడకు ప్రాచుర్యం కల్పించారు. ఆ స్ఫూర్తితో ఇప్పటికి పలువురు ఇంద్రజాలికులు ఈ సాహసం విజయవంతంగా ప్రదర్శించారు. కానీ, లాహిరి విషయంలో మాత్రం అనుకున్నట్టు జరుగలేదు. పోలీసులతోపాటు విపత్తు సహాయ బృందం లాహిరి కోసం నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. తన సాహస యత్నానికి లాహిరి కోల్‌కతా పోలీసులు, పోర్ట్ ట్రస్ట్ నుంచి అనుమతి పొందినట్టు అధికారులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: