తెలంగాణ మంత్రిమండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరగనుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ సమావేశాన్ని భారీ ఎజెండాతో నిర్వహించనున్నారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త పంచాయతీరాజ్‌, రెవెన్యూ, పురపాలక చట్టాలను, రోడ్డు భద్రత చట్టాలను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌చట్టం అమలులోకి వచ్చింది. మంగళవారం కొత్త పురపాలక చట్టం, రోడ్డు భద్రత చట్టాలకు ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రిమండలి అనుమతిస్తూ తీర్మానాలు చేయనుంది.


ఎజెండాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. సోమవారం వరకు వివిధ శాఖల నుంచి వచ్చిన అంశాలను ప్రభుత్వం ఎజెండాలో చేర్చింది. లక్ష రూపాయలలోపు రుణ మాఫీని మళ్లీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చ. ఆసరా పింఛన్ల పెంపునకు నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటి నుంచి వాటి పంపిణీ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణం గురించి శాసనమండలిలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలి. బైసన్‌పోలో మైదానం భూముల లభ్యతపై అనుమానాలు ఉండటంతో ప్రస్తుత సచివాలయం ఉన్న చోటనే కొత్త భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్దకు వచ్చింది.


కొత్త శాసనసభను ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల భవన సముదాయం వద్ద నిర్మించాలని భావిస్తోంది. వీటిపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టుల వ్యయపరిమితికి సంబంధించి మూడేళ్ల క్రితం జారీ చేసిన జీవో నంబరు 146 కాలపరిమితి ముగిసింది. దానిని కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, మిషన్‌ కాకతీయల గురించి చర్చ. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రుణ సాయానికి అనుమతిపై నిర్ణయం.


ములుగు, నారాయణపేట కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులకు ఆమోదం. ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి, సీపీఎస్‌ రద్దు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికే పీఆర్‌సీ దీనిపై అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించి చర్చ. విద్య, వైద్యరంగం, ఉద్యోగ నియామకాలకు ఆమోదాలు వంటివాటిపై చర్చించాల్సి ఉంది. చూస్తుంటే, కే.సి.ఆర్ అద్భుత అభ్యున్నతి దిశగా తెలంగాణను తీసుకెళ్తున్నారని మనకు సుస్పష్టంగా స్సార్ధం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: