అవును తెలుగుదేశంపార్టీ నుండి ఆఫీసును బిజెపి లాగేసుకుంటోంది. మొన్నటి ఎన్నికల తర్వాత పార్లమెంటులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త అంటే నరేంద్రమోడి ప్రభుత్వమే రెండోసారి కొత్తగా ఏర్పడింది లేండి. పార్లమెంటులో వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయిస్తారన్న విషయం తెలిసిందే.

 

మొన్నటి వరకూ టిడిపికి 18 మంది ఎంపిలుండేవారు.  2014 ఎన్నికల్లో బిజెపికి మిత్రపక్షం కూడా. అందుకనే ఎన్డీఏలో ఉంటూ తమ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కోసం మంచి ఆఫీసునే తీసుకుంది టిడిపి. పైగా దాని పక్కనే బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కూడా ఉంది. పార్టీలు గెలిచిన ఎంపిల సంఖ్య ఆధారంగానే కార్యాలయాలను కేటాయిస్తారు.

 

మారిన పరిస్దితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిందే ముగ్గురు ఎంపిలు. అందుకనే ఆ కార్యాలయంపై బిజెపి కన్ను పడింది. అసలు పోయినసారే టిడిపికి వేరే చోట కార్యాలయాన్ని కేటాయిస్తామని పార్లమెంటు సచివాలయం చెప్పింది. కాకపోతే అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న  రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళ లాబీయింగ్ వల్ల టిడిపిని ఖాళీ చేయించలేకపోయారు.

 

కానీ ఇపుడు సీన్ మొత్తం మారిపోయింది. టిడిపి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాదు. పైగా గెలిచింది కూడా ముగ్గురు ఎంపిలే. అందుకని టిడిపికి అంతపెద్ద కార్యాలయం అవసరం లేదని బిజెపి అనుకున్నది. అందుకనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వచ్చి కార్యాలయాన్ని పరిశీలించారు. అలాగే హోం శాఖ మంత్రి అమిత్ షా సిబ్బంది కూడా వచ్చి మొత్తం కార్యాలయమంతా చూసి వెళ్ళారు.

 

బిజెపి వరస చూస్తుంటే టిడిపిని కార్యాలయం నుండి గెంటేయటం ఖాయమని అర్ధమైపోయింది. ఎలాగూ ఈ కార్యాలయం పక్కనే బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కూడా ఉంది కదా ? అందుకనే దాన్ని విస్తరించాలంటే టిడిపి కార్యాలయాన్ని కూడా తీసేసుకోవాలని బిజెపి అనుకుందట. బహుశా అమిత్ షా కోసం ఈ కార్యాలయాన్ని తీసేసుకోవచ్చని అనుకుంటున్నారు. ఏదేమైనా టిడిపిని మాత్రం ఈ కార్యాలయం నుండి గెంటేయటం ఖాయమనే అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: