ఏపీ టీడీపీలో బిజెపి తీసే ఫస్ట్ బిగ్ వికెట్ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరే అని తెలుస్తోంది. ఐదేళ్లపాటు ఎంచక్కా చంద్రబాబు చెంత ఉంటూ ఆయనకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ చంద్రబాబును తప్పుదోవ పట్టించి టీడీపీ పతనంలో తన వంతు పాత్ర పోషించిన సుజనా చౌదరి సైకిల్ దిగి కాషాయం గూట్లో చేరేందుకు రంగం సిద్ధమైందని. దీనిపై రెండు మూడు రోజుల్లోనే ఓ క్లారిటీ రానుంది అని తెలుస్తోంది. ఈ విషయపై సుజనా చౌదరి ఇప్పటికే చంద్రబాబుకు కూడా వర్తమానం పంపార‌ట. 


టిడిపి పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుజనా చౌదరి పార్టీ కోసం ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలోనే  సుజ‌నాను  బాబు ఏకంగా రెండుసార్లు రాజ్యసభకు పంపుతారు. పార్టీకి వచ్చిన కేంద్ర మంత్రి పదవుల్లో ఒకటి ఆయనకు కేటాయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఏపీ టీడీపీ నేతలు బిజెపి, మోడీని టార్గెట్‌గా చేసుకుని తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారు. అయితే సుజనా చౌదరి మాత్రం బిజెపిపై విమర్శలు చేసే క్రమంలో చాలా ఆచితూచి వ్యవహరించారు. అప్పుడే ఆయన తీరుపై చాలామందికి అనుమానాలు వచ్చాయి. 


సుజనా చౌదరి కంపెనీలు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. ఆయన కేసుల‌పై సీరియ‌స్‌గా విచార‌ణ చేయిస్తే ఆయ‌న ఖ‌చ్చింగా జైలు ఊస‌లు లెక్క‌పెట్టాల్సిందే అన్న విమ‌ర్శ‌లు కూడా ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్నాయి. ఇప్పటికే ఆయనపై ఆర్థిక తవ్వకాల కేసులు ఉన్నాయి. సీబీఐ కేసులకు ముందే బిజెపిలో చేరితే ఎలాంటి ఇబ్బంది ఉండదని సుజనా ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబును మేనేజ్ చేసి ఎలాగోలా రెండోసారి రాజ్యసభకు ఎంపికైన ఆయనకు మళ్లీ ఆ కొనసాగింపు ఉండాలంటే టిడిపితో సాధ్యం కాదు. అందుకే ఆయన ఇవన్నీ ఆలోచించి తెలివిగా బిజెపి వైపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి బిజెపి పెద్దలతో ఆయ‌న అత్యంత సన్నిహితంగా ఉన్నార‌న్న అనుమానాలు టీడీపీ వాళ్ళకి ఉన్నాయి. 


ఇక తాజాగా పార్టీ ఎన్నికల్లో ఓటమిపై ఆయన స్పందిస్తూ రాష్ట్రంలో ఉనికిలేని పార్టీతో యుద్ధం చేయడమే టిడిపి ఓటమికి ప్రధాన కారణం అని చెప్పారు. దీనిని బట్టి బిజెపితో చంద్రబాబు అనవసరంగా పెట్టుకున్నారని ఆయన చెప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక 2014 ఎన్నికల సమయంలో బిజెపి, పవన్ కారణంగానే టిడిపి గెలిచింది అని కూడా చెప్పారు. ఈ సారి కూడా బిజెపితో విభేదించ‌కుండా ఉంటే టిడిపి  ఖచ్చితంగా గెలిచేదని చెప్పారు. తను బీజేపీలోకి వెళితే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని కూడా పరోక్షంగా సుజన మాటల ద్వారా అర్ధం అయింది. 


ఇదిలా ఉంటే గత నాలుగేళ్లలో సుజనాచౌదరికి ఇటు పార్టీ యువనేత లోకేష్‌కు ఏమాత్రం పొస‌గ‌లేదు. కొన్ని విషయాల్లో వీరి మధ్య తీవ్రమైన బేధాభిప్రాయాలు రావడంతో పరోక్షంగా ఒకరికి ఒకరు ఎర్త్ పెట్టుకునే ప్రయత్నాలు చేశారు. కొన్ని సందర్భాల్లో లోకేష్ పై సుజనా చౌదరి ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ కూడా సుజనా చౌదరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఎన్నిక‌ల ముందు వరకు వారిద్దరి మ‌ధ్య‌ అలా కొనసాగుతూనే వచ్చింది. ఏదేమైనా చంద్రబాబుకు అండగా ఉంటూ, లోకేష్‌కు ఎనిమీగా ఉన్న‌ సుజన మొత్తానికి టిడిపిలో ఉండేందుకు ఇష్టపడటం లేదన్న‌ది మాత్రం క్లారిటీ వచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: