తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను సంపూర్ణంగా వాడుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు నిర్ణయించారు. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల్లో ఉన్న అన్ని కేసులను సత్వరమే ఉపసంహరించుకొని, రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చించుకొని, అన్ని వివాదాలను పరిష్కరించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏపీలోని ఓడరేవుల ద్వారా తెలంగాణ సరకులను ఎగుమతి చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాల కోసం విమానాల సంఖ్య పెంచాలని భావించారు.

 

జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల వెనుకబాటు గురించి కేసీఆర్‌ వివరించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు ఇవ్వాలనే నిర్ణయం జరిగినా కేంద్రం దానిని అమలు చేయకుండా ట్రైబ్యునల్‌లను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుందని వివరించారు. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల చుట్టూ తిరిగినా అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ సరైన ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడంతో పాటు చెక్‌డ్యామ్‌ల వంటివి లేకపోవడం వంటి వాటి వల్ల వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది.

 

ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉందని, ఓడరేవులు ఉన్నాయని, వీటి ద్వారా ఎగుమతులు సాగుతున్నాయని, వాటిని ముమ్మరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని కేసీఆర్‌ చెప్పారు. తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు జరిగే ఎగుమతుల కోసం ఏపీలోని ఓడరేవులకు తెలంగాణ నుంచి సరకులను పంపిస్తామని ఆయన చెప్పగా.. అందుకు జగన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 

ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కేసీఆర్‌ స్వయంగా జగన్‌ను ఆహ్వానిస్తూ పత్రికను అందజేశారు. గోదావరి జలాల సద్వినియోగమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందని, రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా ఘనంగా జాతికి అంకితం చేస్తున్నామని, ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామి కావాలని కేసీఆర్‌ కోరారు. దీనికి జగన్‌ అంగీకరించారు. ఈ ఆహ్వానం తనకు గొప్ప గౌరవమని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి, ప్రారంభోత్సవంలో పాల్గొంటానని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: