పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం రెండో రోజైన మంగ‌ళ‌వారం కూడా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఇవాళ లోక్ సభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. 17వ లోక్‌సభలో తెలంగాణ రాష్ర్టానికి చెందిన సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది ఎంపీలు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీ ప్రమాణస్వీకారం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ప్రమాణం చేయగా.. ఆ తర్వాత వరుసగా బండి సంజయ్‌ కుమార్‌, అరవింద్‌ ధర్మపురి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, అసదుద్దీన్‌ ఓవైసీ, డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు ప్రమాణం చేశారు. 


అయితే, వీరందరిలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం ఆసక్తిగా జరిగింది. ఆయన్ను ప్రమాణానికి లోక్ సభ అధికారులు పిల్చినప్పుడు.. బీజేపీ సభ్యులు భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. చేయండి.. అలాగే నినాదాలు చేయండి… అంటూ నవ్వుతూ… చేతులు ఊపుతూ అసదుద్దీన్ స్పీకర్ పోడియం ముందుకు వచ్చారు. కొంచెం వాళ్లను ఆపండి ప్రమాణం చేస్తాను అని అధికారులకు చెప్పారు. తర్వాత ఉర్దూలో ప్రమాణం చేశారు అసదుద్దీన్. చివర్లో జై భీమ్..అల్లాహో అక్బర్.. జై హింద్ అంటూ అసదుద్దీన్ ఒవైసీ ముగించారు .


ఇక తెలంగాణ ఎంపీల‌లో వెంకటేశ్‌ నేతకాని, బండి సంజయ్‌ కుమార్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు తెలుగు భాషలో ప్రమాణస్వీకారం చేశారు. అరవింద్‌ ధర్మపురి, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంగ్లీష్‌ భాషలో ప్రమాణం చేయగా, బీబీ పాటిల్‌, అసదుద్దీన్‌ ఓవైసీ హిందీ భాషలో ప్రమాణం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: