ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన తెలుగుదేశం పార్టీకి మ‌రిన్ని షాకులు త‌గ‌ల‌నున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ చ‌రిత్ర‌లో లేనంత దారుణ ఓట‌మిని చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎదుర్కున్న తెలుగుదేశం పార్టీ నేత‌లు...త‌మ దారి తాము చూసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలోనే..ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టింద‌నే అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఒక‌రిద్ద‌రు ఎంపీలు, కొంద‌రు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు చూస్తున్నార‌నే వార్త‌లు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలో చీలిక వ‌స్తుంద‌ని ప్ర‌కటించారు.


అనంతపురంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎదిగేందుకు బీజేపీ ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీయేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  బీజేపీ కొత్త రాజకీయ ఒరవడి సృష్టించబోతోందని, త్వరలోనే రాజకీయ సంచలనాలు ఖాయమని అన్నారు. బీజేపీని దెబ్బ తీయాలని చూసిన టీడీపీకి ఇప్పుడు నాయకత్వ సమస్య వచ్చిందన్నారు. టీడీపీ త్వరలోనే చీలిపోతుందని, చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. త్వ‌ర‌లోనే త‌మ పార్టీలోకి ఈ చేరిక‌లు ఉంటాయ‌ని విష్ణువర్ధ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


ఏపీకి చెందిన కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన కీలక నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి తెలిపారు. రాయలసీమలో దశాబ్దాల చరిత్ర ఉన్న కుటుంబాలు బీజేపీ వైపే చూస్తున్నాయని అన్నారు. వారి చేరికపై బీజేపీ అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేశారంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని.. కానీ చట్టాలకు ఎవరూ అతీతులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని విష్ణు అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించే శ‌క్తి లేని టీడీపీ ఇలా ప్ర‌చారం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: