ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జ‌రిగిన‌ చర్చ కొత్త ప్ర‌చారానికి తెర‌తీసింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై జ‌న‌సేన ఎమ్మెల్యే ప్ర‌శంస‌లు కురిపించారు. మాట త‌ప్ప‌ను మ‌డ‌మ తిప్ప‌ను అనే నినాదంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌శంసించారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న జ‌గ‌న్‌ ఇదే రీతిలో ముందుకు సాగాల‌ని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై జాలి చూపాల‌ని వ్యాఖ్యానించారు. 


వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలంటూ జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. జ‌న‌సేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యాలపై సీరియస్‌గా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి... వరప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని శ్రీకాంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు విషయం అందరికీ తెలుసని విమర్శించారు. కేంద్రంతో పొట్లాడే పరిస్థితి లేదని, సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తున్నామని... ఏ సమావేశమైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ చెబుతూ వస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


ప్ర‌భుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాపాక వరప్రసాద్ ``శ్రీకాంత్‌రెడ్డి గారు అన్ని బాణాలు నాపై ఎక్కుపెట్టాల్సిన అవసరం లేదు... నేను ఒక్కడినే ఉన్నా. నాపై ద‌య‌చూపండి`` అని అన్నారు. దీనికి జ‌గ‌న్ చిరున‌వ్వుతో స్పందించారు. వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలని వ్యాఖ్యానించడం త‌న తప్పే అని ఒప్పుకున్న రాపాక‌.. అయితే, కేంద్రంతో సఖ్యతతో ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని సూచించారు. ప్రభుత్వం మంచి పథకాలను తీసుకొస్తుందని... వాటిని సవ్యంగా అమలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతోందని జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: