ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు బాధితులు కోడెల కుమారుడు శివరాం, కుమార్తెపై ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. తాజాగా సత్తెనపల్లికి చెందిన కాంట్రాక్టర్ వాసు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.  వివరాలు లోకి వెళితే ఇలా వున్నాయి....

 

నరసరావుపేటలో జరిగిన ‘ఖేలో ఇండియా గేమ్స్’లో మిల్స్ కాంట్రాక్ట్‌కు గాను తన దగ్గర కోడెల శివరాం రూ. 15 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అడగకుండా, నరసరావుపేట 2 టౌన్‌లో శివరాంపై మరో ఫిర్యాదు నమోదైంది. దివ్యాంగుడు అయిన ఏనుగంటి వెంకట కృష్ణారావు ఇక్కుర్రు, అల్లూరువారిపాలెం, తుంగపాడు గ్రామాల్లో తమపై దాడి చేయించి కేబుల్ కనెక్షన్‌లను లాక్కున్నాడని ఫిర్యాదు చేశారు.

 

శివరాం అనుచరులు నాలుగు లక్షల నగదు కూడా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జిల్లాలోని నరసరావుపేటలోని ఐలా బజార్‌లో 28 సెంట్ల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి తన ఆస్తిని కబ్జా చేశారని కోడెల శివరాంపై చిరుమెల్ల బసవేశ్వరరావు అనే వ్యక్తి 2 టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని.. వీలైనంత త్వరలోనే శివరాంను పీఎస్ రప్పించి విచారిస్తామని బాధితులకు చెప్పినట్లు తెలుస్తోంది.

 

కాగా ఈ ఫిర్యాదులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ కేసుల వ్యవహారంపై ఇటీవల మీడియా ముందుకు వచ్చిన కోడెల.. కక్ష సాధింపు చర్యలు కరెక్టు కాదని.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే తమపై కేసులు వేస్తున్నారని.. అవాస్తవాల్ని తమపై రుద్ది, వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చూద్దాం మరి ఇది ఎక్కడివరకెళుతుందో!


మరింత సమాచారం తెలుసుకోండి: