నూతనాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరవాత విదేశీ పర్యటనలకు ఆయన చేసిన కొన్ని ఖర్చులను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బయటపెట్టారు. నవంబర్ 2014 నుంచి ఏప్రిల్ 2016 వరకు చంద్రబాబు చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను ప్రధాన పరిపాలన శాఖ వెల్లడించినట్లు చూపుతోన్న పత్రాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

 

ఆ లెక్కల గురించి విజయసాయి ట్వీట్ చేస్తూ, 'చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఒక పత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మొదటి ఆరు నెలల్లో సారు నెల రోజులు విదేశాల్లోనే గడిపారు. మందీ మార్బలాన్ని వెంటేసుకుని సింగపూర్, చైనా, స్విట్జర్లాండ్, జపాన్‌ సందర్శించారు. ఏం సాధించారో ఎక్కడా కనిపించదు’ అని సెలవిచ్చారు.

 

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పార్టనర్‌షిప్ సమిట్‌పై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. సమిట్ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ‘2018 ఫిబ్రవరిలో విశాఖలో అట్టహాసంగా జరిపిన పార్టనర్‌షిప్‌ సమిట్‌లో రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని చంద్రబాబు ప్రకటించారు. రూ.100 కోట్ల వృథా ఖర్చు తప్ప రూపాయి పెట్టుబడి రాలేదు. నీతి ఆయోగ్‌ బిత్తరపోయిందట ఈయన స్టేట్‌మెంట్ చూసి. ఐదేళ్లూ ఇలాగే మభ్య పెట్టారు ప్రజలను’ అని ట్వీట్ చేశారు.

 

అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా పలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరవాత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విజయసాయి మరిన్ని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎద్దేవా చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: