రాజ‌కీయాల్లో ఇటు కుద‌ర‌క‌పోతే.. అటు నుంచి న‌రుక్కుర‌మ్మ‌నేది ఓ సామెత‌. రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చు. ఏమైనా జ‌రగొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే తెలంగాణ‌లోనూ జ‌రుగుతోంది. ముఖ్యంగా రాజ్యాధికారాన్ని కోరుకుంటున్న రెడ్డి స‌మాజిక వ‌ర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న ప‌రిణామం మ‌న‌కు తెలిసిందే. ఉమ్మ‌డి ఏపీలో దాదాపు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకులే కాంగ్రెస్‌ను న‌డిపించారు. సీఎంలుగా కూడా చ‌క్రాలు తిప్పారు. 


అయితే, ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంతో క‌మ్మ వ‌ర్గం రాజ‌కీయాల్లో బ‌లంగా పుంజుకుంది ఇక‌, త‌ర్వాత చంద్ర‌బాబు ద్వారా మ‌రింత‌గా రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరింది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అయితే, రెడ్డి వ‌ర్గానికి ఇరువురి పాల‌న‌లోనూ అన్యాయం జ‌రుగుతోంద‌ని భావించిన ఆ సామాజిక వ‌ర్గం రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపింది. ముఖ్యంగా ఏపీలో తాజాగా అధికార మార్పు వెనుక రెడ్డి సామాజిక వ‌ర్గం ప్ర‌మేయం బ‌లంగా ఉంది. 


ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే., కాంగ్రెస్‌కు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ‌కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని, రెడ్డి రాజ్యం వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, వ్యూహాత్మ‌కంగా ప్రాంతీయ రాజ‌కీయాల‌ను రెచ్చ‌గొట్టిన కేసీఆర్‌..మ‌రోసారి అధికారం సంపాయించుకున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లోని రెడ్లు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి క‌నిపించిన ప్ర‌త్యామ్నాయం బీజేపీ. ద‌క్షిణాదిలోనూ పాగావేయాల‌ని భావిస్తున్న క‌మ‌ల నాథులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకురెడీ అయ్యారు. ఇది తెలంగాణ‌లో బీజేపీ స్టార్ట్ చేసిన కొత్త ఆప‌రేష‌న్‌గా రాజ‌కీయ వ‌ర్గాలు చెపుతున్నాయి.


ఈ క్ర‌మంలోనే డీకే అరుణ వంటి కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు కోమ‌టిరెడ్డి వంటి బ‌ల‌మైన నాయ‌కుల‌ను కూడా చేర్చుకునేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు, రాష్ట్రంలో బీజేపీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన కిష‌న్ రెడ్డికి కేంద్రంలో మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం వెనుక కూడా రాష్ట్రంలో రెడ్డి వ‌ర్గాన్ని స‌మీక‌రించి, రాబోయే ఎన్నికల నాటికి.. అధికారంలోకి వ‌చ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాలు .. కేసీఆర్ కు సెగ పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: